AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!
తమ ప్రణాళికలో భాగంగా అన్నా డీఎంకేతో బీజేపీ(AP Formula) పొత్తు కుదుర్చుకుంది.
- By Pasha Published Date - 08:41 PM, Sat - 12 April 25

AP Formula : వచ్చే సంవత్సరమే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటి కోసం బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. భావసారూప్య రాజకీయ పార్టీలతో కలిసి తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో మోడీ సేన ఉంది. ఈక్రమంలోనే తాజాగా తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. వచ్చే అసెంబ్లీ పోల్స్‌లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు డిసైడయ్యాయి. అన్నా డీఎంకే విధించిన షరతు మేరకే.. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తొలగించి నైనార్ నాగేంద్రన్‌ను నియమించారు. నైనార్ నాగేంద్రన్ రాజకీయ జీవితం అన్నా డీఎంకే పార్టీతోనే మొదలైంది. ఈయనకు అన్నా డీఎంకే అగ్రనేత ఎడప్పాడి పళని స్వామితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పళని స్వామి సిఫారసు మేరకే తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్‌కు ఛాన్స్ ఇచ్చారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడులో బీజేపీ అమలు చేయబోతున్న ఆంధ్రప్రదేశ్ ఫార్ములా గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Ants Destruction : జర్మనీలో చీమల దండు బీభత్సం.. కొరికేస్తూ, నమిలేస్తూ..
ఏపీ ఫార్ములాతో కమలదళం..
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి .. తొలుత జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది. టీడీపీ మాత్రం ఆ రెండు పార్టీలతో సమ దూరాన్ని పాటించింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ సర్కారు అరెస్టు చేయించాక.. పరిస్థితులు మారాయి. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో ఓ వైపు బీజేపీ పెద్దలు.. మరోవైపు పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ వరుస భేటీలు జరిగాయి. అప్పట్లో నారా లోకేశ్ స్వయంగా వెళ్లి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తోనూ సమావేశమయ్యారు. ఆ తర్వాత పరిణామాలు మారాయి. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక.. జనసేనతో జట్టుకట్టారు. తదుపరిగా బీజేపీ,జనసేన,టీడీపీల కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొంచెం అటూఇటుగా ఇదే విధమైన ఫార్ములాను అమలు చేసేందుకు బీజేపీ రెడీ అయింది.
Also Read :Rana With Pak Army : పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరేతో రాణాకు లింకులు
విజయ్ పార్టీ ఇవ్వబోయే ట్విస్టు .. అదేనా ?
తమ ప్రణాళికలో భాగంగా అన్నా డీఎంకేతో బీజేపీ(AP Formula) పొత్తు కుదుర్చుకుంది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయి. వీలైతే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల కూటమిలోకి హీరో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చేరే అవకాశం ఉంది. ప్రముఖ రాజకీయ పండితుల అంచనా ప్రకారం.. విజయ్ పార్టీ టీవీకే ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్నా డీఎంకే, బీజేపీ కూటమి ఓ వైపు.. విజయ్ పార్టీ టీవీకే మరో వైపు.. అధికార డీఎంకే ఇంకో వైపు వేర్వేరుగా తలపడుతాయి. అంటే ముక్కోణపు పోటీ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి టీవీకే జై కొట్టే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయని అంటున్నారు. ఏపీ ఫార్ములాలో కొద్దిపాటి మార్పులతో తమిళనాడు అధికార పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా మోడీ సేన పావులు కదుపుతోంది.