బీహార్‌లో దారుణం..డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు
- Author : Vamsi Chowdary Korata
Date : 12-02-2026 - 10:49 IST
Published By : Hashtagu Telugu Desk
వివరాల్లోకి వెళితే.. సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ కోసం శిక్షణ పొందుతున్నాడు. చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ నెల 7న నితీశ్ లైబ్రరీకి వెళుతుండగా, శంకర్ రాయ్ కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. తీవ్రంగా కొట్టి, మత్తు మందులు ఇచ్చి మోర్వాలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి శంకర్ రాయ్ కుమార్తె లక్ష్మీ కుమారితో బలవంతంగా వివాహం జరిపించారు. అనంతరం అతడిని ఇంట్లోనే నిర్బంధించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వివాహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది. వీడియో చూసిన సమస్తీపూర్ పోలీసులు శంకర్ రాయ్ ఇంటికి చేరుకుని నితీశ్‌ను రక్షించారు. అనంతరం అతడిని విచారించగా, తనను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసినట్లు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అయితే, బిహార్‌లో ‘పకడ్వా వివాహ్’ (బలవంతపు పెళ్లిళ్లు) ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న లేదా ఉన్నత చదువులు పూర్తిచేసిన యువకులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వివాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2009 లోనే రాష్ట్రంలో 1,224 బలవంతపు పెళ్లిళ్లు నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. కొన్నిసార్లు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లిళ్లు జరిపిస్తున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి.