Sabarimala Prasadam: శబరిమల ప్రసాదంలో కల్తీ.. అసలేం జరిగిందంటే..?
శబరిమల ప్రసాదమైన ‘అరవణ’లో కల్తీ జరిగిందని.. మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ‘అరవణ’ను ఎరువుగా మార్చనున్నారు.
- By Gopichand Published Date - 09:34 AM, Mon - 7 October 24
Sabarimala Prasadam: ఏపీలో నిన్న మొన్నటి వరకు లడ్డూ ప్రసాదంపై వివాదం ఎంత దుమారం రేపిందో మనకు తెలిసిందే. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల నెయ్యి వాడారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాశంమైంది. లడ్డూ ప్రసాదంపై ఇప్పుడిప్పుడే కాస్త వివాదం సదుమణుగుతున్న సమయంలో మరో ప్రసాదంపై వివాదం మొదలైంది. అదే శబరిమల ప్రసాదం (Sabarimala Prasadam).
శబరిమల ప్రసాదమైన ‘అరవణ’లో కల్తీ జరిగిందని.. మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ‘అరవణ’ను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా ఉంది. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణల వల్లే వీటి వాడకాన్ని నిలిపివేశారని తెలుస్తోంది. అయితే ఈ ప్రసాదాల విషయంలో భక్తులు మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేందుకు దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రసాదాలను పారబోసేందుకు దేవస్థానం బోర్డు టెండర్లను ఆహ్వానించింది. అయితే ఈ టెండర్‌ను ఇండియన్ సెంట్రిఫ్యుజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దక్కించుకుందని సమాచారం. ఈ సంస్థ కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మార్చనున్నట్లు టీడీబీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు.
Also Read: Bigg Boss 8 Wild Card Entries : బిగ్ బాస్ 8.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొదటి రోజే షాక్..!
శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసందే. రోజుకు గరిష్టంగా 80 వేల మందిని దర్శించుకునేందుకు అనుమతించింది. ఈ ఏడాది ఆన్ లైన్ బుకింగ్ ద్వారానే అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతినిచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకుని 41 రోజులపాటు దీక్ష చేస్తారు. 41 రోజుల తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు.