Heart Attack: గుండెపోటు వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా? పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి!
Heart Attack: గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని,అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:22 AM, Sun - 12 October 25

Heart Attack: ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ కారణంగా చాలామంది మరణిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలా మంది గుండెపోటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండె పోటు బారిన పడుతుండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తున్న విషయం. అయితే గుండెపోటు అనేది అకస్మాత్తుగా సంభవిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు చికిత్స అంది ప్రాణాలతో బయట పడితే మరీ కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు.
ఇకపోతే ఈ గుండెపోటు వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం ఛాతీ నొప్పి లేదా అసౌకర్యంగా అనిపించడం. ఇది తరచుగా ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి సాధారణంగా ఛాతీ మధ్యలో సంభవిస్తూ ఉంటుంది. కొన్ని నిమిషాల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. కొన్నిసార్లు ఈ నొప్పి మెడ, ఎడమ దవడ, భుజం, వీపు లేదా చేతులకు కూడా వ్యాపిస్తుంది.
అయితే ఛాతీ నొప్పి కొన్నిసార్లు గ్యాస్ వల్ల కూడా రావచ్చని చెబుతున్నారు. ఛాతీ నొప్పితో లేదా లేకపోయినా శ్వాస ఆడకపోవడం గుండె పోటుకు కీలకమైన సంకేతం కావచ్చట. గుండె సరిగ్గా పనిచేయలేనప్పుడు, ఊపిరితిత్తులు సరైన మొత్తంలో ఆక్సిజన్ ను అందుకోలేనప్పుడు ఈ సమస్య వస్తుందని, ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చని చెబుతున్నారు. అకస్మాత్తుగా చలితో చెమటలు పట్టడం గుండెపోటుకు మరొక హెచ్చరిక లక్షణంగా చెబుతున్నారు. ఈ చెమట సాధారణంగా ఒత్తిడి లేదా వేడి వల్ల కలగదని, కానీ శరీరం లోపల జరుగుతున్న కొంత అవాంతరానికి సంకేతం కావచ్చని చెబుతున్నారు.
అయితే ఎలాంటి కారణం లేకుండా మీకు చెమటలు పడుతుంటే దానిని లైట్ తీసుకోకూడదని ఇది గుండెపోటుకు సంకేతం అని చెబుతున్నారు. గుండెపోటు సమయంలో, గుండె పనిచేసే సామర్థ్యం తగ్గుతుందట. దీని కారణంగా తగినంత రక్తం మెదడుకు చేరదట. దీంతో రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల తలతిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చని చెబుతున్నారు. మీకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చట. కొంతమందికి గుండెపోటు సమయంలో వికారం, వాంతులు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయట. ఈ లక్షణం తరచుగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎటువంటి అనారోగ్యం లేకుండానే వికారం లేదా వాంతులు అనిపిస్తే, దానిని తీవ్రంగా పరిగణించాలట. అంతేకాకుండా చాలా మందికి గుండెపోటుకు ముందు అజీర్ణం లేదా ఛాతీలో మంటగా అనిపించవచ్చని చెబుతున్నారు. అలాగే ఎటువంటి కష్టం, పని చేయకపోయినా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చట. ఈ అలసట సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల ముందుగానే ప్రారంభమవుతుందని, అది రోజు రోజుకి క్రమంగా పెరుగుతుందని ఈ లక్షణం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు.