Banana: అరటితో అదిరే లాభాలు
అరటి పండు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే పండ్లలో ఒకటి.
- By hashtagu Published Date - 02:44 PM, Fri - 8 April 22

అరటి పండు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే పండ్లలో ఒకటి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా చౌకైన పండు కూడా ఇదే. ఇందులోనూ ఎక్కువగా పసుపుపచ్చని అరటి పండ్లనే వినియోగిస్తుంటారు. రోజు ఒక అరటి పండు తింటే.. దాని వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..
గుండెకు మేలు: అరటి పండులో సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో లభించే పోటాషియం గుండె చక్కగా పనిచేసేలా చేస్తుంది. రక్తపోటును అదుపులోనూ ఉంచుతుంది. అరటిపండును రోజు తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ..స్ట్రోక్ బారి నుంచి తప్పిస్తుందని పలు అధ్యయనాలు నివేదికలు చెబుతున్నాయి.
పేగులకు కూడా మంచిది: అరటిపండు పేగులకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పెక్టిన్ సమృద్ధిగా లభిస్తుంది. నీటిలో కరిగే పీచు పదార్థం ఇది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
అల్సర్లకు చక్కటి మందు: గుండె మంటగా అనిపించినప్పుడు అరటి పండు తినిచూడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. పొట్టలో పీహెచ్ బ్యాలన్స్ ను అరటి పండు కాపాడుతుంది. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. దీంతో రక్తం నేరుగా జీర్ణాశయానికి చేరేందుకు తోడ్పడుతుంది. అరటిలో ఉండే ప్రొటీజ్ ఇన్హిబిటర్స్ కడుపులో అల్సర్లకు కారణం అయ్యే బ్యాక్టీరియాపై పోరాడుతాయి.
కండరాలను బలోపేతం చేస్తుంది: కండపుష్టి కోరుకునే వారు ప్రతిరోజు అరటి పండును తీసుకోవాల్సిందే. కండరాలు బలోపేతానికి సాయపడే మెగ్నీషియం ఇందులో ఉంటుంది. అందుకే జిమ్ లో కసరత్తులు చేసే వారు అరటిపండ్లను తీసుకుంటారు. శరీరంలో కొవ్వు కరిగేందుకు మెగ్నీషియం చక్కగా సాయపడుతుంది.
మంచి మూడ్ కావాలంటే: అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే అమైన్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని శరీరం సెరటోనిన్ గా మారుస్తుంది.ఇది మనస్సుకు ఉత్సాహానిచ్చే రసాయనం కూడా.