Satellite Crash : ఇస్రో ప్రయోగం ఫెయిల్.. భూమిపై పడిపోనున్న శాటిలైట్ ?
ఉపగ్రహం లోపల ఉన్న థ్రస్టర్లను మండించేందుకు ఇస్రో సైంటిస్టులు(Satellite Crash) చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
- By Pasha Published Date - 08:41 AM, Tue - 4 February 25

Satellite Crash : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 100వ ప్రయోగం ఫెయిల్ అయినట్టే. ఈ ప్రయోగం ద్వారా ఎన్‌వీఎస్–02 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావించింది. అయితే అది జరగలేదు. జనవరి 31వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట వేదికగా నిర్వహించిన ప్రయోగం ద్వారా ఎన్‌వీఎస్–02 శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపారు. ప్రస్తుతం ఆ ఉపగ్రహం జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో చక్కర్లు కొడుతోంది. ఉపగ్రహం లోపల ఉన్న థ్రస్టర్లను మండించేందుకు ఇస్రో సైంటిస్టులు(Satellite Crash) చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
Also Read :YS Jagan : జగన్‌పై అనర్హత వేటు వేస్తారా ? పులివెందులకు బైపోల్ తప్పదా ?
ఇంజిన్ పనిచేయని ఉపగ్రహం..
దీంతో ఆ శాటిలైట్ ఇంజిన్ పనిచేయడం లేదు. ఇంజిన్‌లోకి ఆక్సిడైజర్‌ను అందించే వాల్వులు తెరుచుకోవడం లేదు. లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్‌ఏఎం) వ్యవస్థ విఫలమైంది.శాటిలైట్‌లోని ఇంజిన్ పనిచేస్తేనే, దాన్ని జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ నుంచి జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి పంపడం వీలవుతుంది. కానీ అది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇంజిన్ పనిచేయని ఎన్‌వీఎస్–02 ఉపగ్రహం, జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోనే ఎక్కువ రోజుల పాటు ఉంటే.. చివరకు భూమిపై పడే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read :World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం చరిత్ర తెలుసా..?
ముక్కలై మండిపోయి..
ఎన్‌వీఎస్–02 ఉపగ్రహంలోని థ్రస్టర్లు యాక్టివేట్ కానందున.. అది దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరుగుతుంటుంది. దీనివల్ల శాటిలైట్ కక్ష్యల్లో ఆకస్మిక మార్పులు జరుగుతుంటాయి. చివరకు అది అంతరిక్ష కక్ష్య నుంచి తప్పుకొని.. భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది. వాతావరణంలో ఉండే తీవ్ర ఘర్షణ కారణంగా అది ముక్కలై మండిపోతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 40 టన్నుల అంతరిక్ష వ్యర్థాలు భూమిపై పడుతున్నాయి. శాటిలైట్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు, లోహాలు, రేడియోధార్మిక పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తాయి.
ఏమిటీ ఎన్‌వీఎస్–02 ?
భారత్‌కు చెందిన స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పేరు ‘నావిక్’. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపర్చేందుకు పంపిన రెండో ఉపగ్రహమే ఎన్‌వీఎస్–02. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయి ఉంటే, ఈ ఉప్రహం నుంచి భారత్‌తోపాటు చుట్టుపక్కల 1,500 కిలోమీటర్ల పరిధిలోని వినియోగదారులకు జీపీఎస్, టైమింగ్ డేటా వంటి సమాచారం అత్యంత కచ్చితంగా అంది ఉండేది.