Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
- By Latha Suma Published Date - 10:42 AM, Wed - 27 August 25

Prashant Kishor : జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇటీవల బీహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రేవంత్ రెడ్డి పాల్గొనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.
బీహార్ ప్రజల సమస్యలు వారికి తెలియవు
రాహుల్ గాంధీ యాత్రపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన పీకే బీహార్ ప్రజల కోసం ఎవరు నిజంగా పని చేయాలనుకుంటున్నారో వాళ్లే ముందుకు రావాలి. కానీ, బీహార్ ప్రజల జీవితాలను, వారి కష్టాలను ఎప్పుడూ అర్థం చేసుకోలేని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటబెట్టుకుని రావడం విచిత్రంగా ఉంది అని విమర్శించారు. రేవంత్ రెడ్డి గతంలో బీహారీ ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ తన వెంట పెట్టుకుంటే బీహార్ ప్రజల మనోభావాలను అవమానించే ప్రకటనే అవుతుంది అన్నారు. మరింతగా రేవంత్ రెడ్డి బీహార్ గ్రామాల్లోకి వెళ్లితే, అక్కడి ప్రజలే ఆయన్ను తరిమివేయాల్సి వస్తుంది అనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ తీరు కూడా ప్రశ్నార్థకం..పీకే
రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడంపై మీడియా ప్రశ్నించగా, ప్రశాంత్ కిషోర్ స్పందన మరింత ఘాటు గా మారింది. రేవంత్ రెడ్డి బీహార్‌కు ఏం చేశారు? ఆయన బీహార్ అభివృద్ధికి ఏం ఉపయోగపడ్డారు? అలాంటి వారిని ముందుకు తెచ్చుకుంటే అది రాహుల్ గాంధీ ఆలోచనా ధోరణినే ప్రతిబింబిస్తుంది అంటూ విమర్శించారు. పీకే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని పీకే ఈ స్థాయిలో విమర్శించడం రాజకీయంగా గంభీర చర్చకు దారితీస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తన పునరుద్ధరణ కోసం కృషి చేస్తుంటే, మరోవైపు అగ్రనేతల ఎంపికలపై ఎదురవుతున్న విమర్శలు ఆ పార్టీకి దుష్పరిణామాలే తెచ్చిపెట్టవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా, జాతీయస్థాయిలో ప్రజల సమస్యలపై విశ్లేషణ చేస్తున్న ప్రశాంత్ కిషోర్, రేవంత్ రెడ్డి బీహార్ పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంగా తెలిపారు. ఇది బీహార్ ప్రజలపై అవమానంగా మారుతుంది. వారి మనోభావాలను గౌరవించకపోతే, రాజకీయం మన ప్రయోజనాలకు కాదు, ప్రజల ప్రయోజనాలకు కావాలి అని ఎలా చెప్పగలం?” అని పీకే అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, రాహుల్ గాంధీ తరఫు స్పందనపై రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
Read Also: Jammu Kashmir : వైష్ణో దేవి ఆలయ మార్గంలో విరిగిపడిన కొండచరియలు..30కి చేరిన మృతులు