Indus Water Treaty : సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తాం: పాక్ మంత్రి
తాజాగా దీని గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
- By Latha Suma Published Date - 03:44 PM, Sat - 3 May 25

Indus Water Treaty : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, భారత్-పాకిస్థాన్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భారత్‌ను తీవ్రంగా కలచివేసింది. దాడికి పాకిస్థాన్ మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలతో, భారత్ పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. తాజాగా దీని గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ప్రేలాపనలు చేశారు. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ వ్యాఖ్యలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
Read Also: PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
భారత్, పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత ప్రభుత్వం, పాకిస్థాన్‌ను శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించాలని కోరింది. అయితే, పాక్ వైఖరిని దృష్టిలో ఉంచుకుని, భారత్ తదుపరి చర్యలను నిర్ణయించనుంది. ఇక, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత పై పాక్ నేతలు పలుమార్లు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. సింధూ నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ మాట్లాడారు.
కాగా, నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం ఇదే ప్రథమం. పాకిస్థాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని, దీర్ఘకాలిక ప్రభావం పడనుందని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే, పహల్గాం ఘటనలో పాక్ మద్దతుతో లష్కరే తోయ్బా ఉగ్రవాదులు పాలుపంచుకున్నట్టు భారత గూఢచార సంస్థలు గుర్తించాయి. వారి చర్యలకు బలైనవి నిరాయుధ పర్యాటకులు కావడం భారత్‌లో తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. ఈ దాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో సైనిక నిక్షేపాలు పెంచబడ్డాయి. అంతేకాదు, పాక్ నియంత్రిత కాశ్మీర్‌తో కూడిన LOC వెంబడి ఆర్మీ హై అలర్ట్ స్థాయికి వెళ్లింది.