బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం
బల్బీర్ పుంజ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
- Author : Gopi
Date : 19-04-2026 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
Balbir Punj: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత, ప్రముఖ పాత్రికేయులు బల్బీర్ పుంజ్ 18 ఏప్రిల్ 2026న కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు జీవితంతో పోరాడి ఓడిపోయిన ఆయన 76 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన మృతితో అటు రాజకీయాల్లోనూ, ఇటు జర్నలిజం రంగంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బల్బీర్ పుంజ్ తన రచనలు, ఆలోచనల ద్వారా చిరపరిచితులు.
ఎవరీ బల్బీర్ పుంజ్?
బల్బీర్ పుంజ్ 1949 అక్టోబర్ 2న పంజాబ్‌లో జన్మించారు. ఆయన ప్రాథమికంగా జర్నలిస్ట్, రచయిత, రాజకీయ మేధావి. 1971లో జర్నలిజంతో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన అనేక ప్రముఖ పత్రికలలో పనిచేశారు. ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ వంటి దిగ్గజ సంస్థలతో అనుబంధం కలిగి ఉండి, సంపాదకత్వ విభాగంలో కీలక పాత్ర పోషించారు. ఆయన హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ రాసేవారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ఆయనకు అపారమైన పట్టు ఉంది. ఆయన రాసే వ్యాసాలు క్రమం తప్పకుండా పెద్ద పత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యేవి.
Also Read: అజింక్యా రహానే ఖాతాలో మరో చెత్త రికార్డు!
రాజకీయ ప్రస్థానం
జర్నలిజంతో పాటు బల్బీర్ పుంజ్ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. భారతీయ జనతా పార్టీలోని అగ్ర నేతల్లో ఆయన ఒకరు. చాలా చిన్న వయసులోనే ఆరెస్సెస్ (RSS)తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆయన రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. మొదటిసారి ఉత్తరప్రదేశ్ నుండి (2000- 2006), రెండోసారి ఒడిశా నుండి (2008–2014). అంతేకాకుండా బల్బీర్ పుంజ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీ ‘ఇంటెలెక్చువల్ సెల్’ కన్వీనర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన నేషనల్ కమిషన్ ఫర్ యూత్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ప్రధాని మోదీ సంతాపం
బల్బీర్ పుంజ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. బల్బీర్ పుంజ్ కేవలం ప్రముఖ రచయిత మాత్రమే కాదని, ఒక తీక్షణమైన ఆలోచనాపరుడు. గౌరవనీయమైన మేధావి అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమని, ప్రజలు ఆయన రచనలకు ముగ్ధులయ్యేవారని ప్రధాని రాశారు. బల్బీర్ పుంజ్ పార్లమెంటరీ ప్రసంగాలు వాస్తవాలతో, మానవీయ విలువలతో నిండి ఉండేవని గుర్తు చేసుకున్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన విశేషంగా శ్రమించారని ప్రధాని కొనియాడారు.
మరోవైపు హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. బీజేపీలో ప్రతి పదవిలోనూ ఉంటూ సంస్థను బలోపేతం చేయడంలో బల్బీర్ పుంజ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. వీరితో పాటు సీఎం యోగి, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా మరియు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా బల్బీర్ పుంజ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.