Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఖుషినగర్ జిల్లా రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు.
- By Gopichand Published Date - 07:51 AM, Thu - 11 May 23

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఖుషినగర్ జిల్లా రామ్‌కోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాఘి మథియా గ్రామంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మఘి మథియా గ్రామంలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని కారణాల వల్ల మంటలు చెలరేగాయని, ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారని, జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఖుషినగర్ జిల్లా మేజిస్ట్రేట్ రమేష్ రంజన్ తెలిపారు.
మృతుల్లో షేర్ మహ్మద్ భార్య, అతని నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తోందని, వారి కష్టాల్లో వారికి అండగా నిలుస్తోందని అన్నారు. మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఓ గదిలో నిద్రిస్తున్నారు.
Also Read: Weather Today: ఇకపై ఎండల వంతు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు..!
సీఎం యోగి సంతాపం
రాష్ట్ర రాజధాని లక్నోలో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖుషీనగర్ జిల్లా అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని జిల్లా పాలనా యంత్రాంగం అధికారులకు సూచించారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.