Supreme Court : యూపీ మదార్స పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..17 లక్షల మంది విద్యార్థులకు ఊరట
విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
- By Latha Suma Published Date - 02:09 PM, Tue - 5 November 24

Madras Education Act : ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం రాజ్యాంగబద్ధమేనని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. మదర్సాల నిర్వహణకు సంబంధించి ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యూకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధమేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక.. విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని తేల్చి చెప్పింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఉత్తరప్రదేశ్‌లోని 16,000 మదర్సాలలో చదువుకుంటున్న 17 లక్షల మంది విద్యార్థులకు భారీ ఊరట కలిగినట్లయ్యింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యూకేషన్ యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధం అంటూ అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం నాడు దీనిపై విచారించిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. యూపీ మదర్సా ఎడ్యూకేషన్ యాక్ట్ చెల్లుబాటును సమర్థిస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఈద్గా ఇమామ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు తీర్పు మదర్సాలలో చదువుకునే విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. యూపీ మదర్సా చట్టాన్ని యూపీ ప్రభుత్వమే రూపొందించిందన్నారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమవుతుందా? అని ప్రశ్నించారు. ఇస్లామిక్ విద్యతో పాటు.. మదర్సాలలో ఆధునిక విద్యను కూడా అందిస్తామని తాము ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని 2004లో ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. కాగా, గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని ఆ సందర్భంగా తెలిపింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇది రాజ్యంగ విరుద్దమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది.