Thunderstorm : ఒడిశాలో పిడుగుల బీభత్సం.. ఏకంగా 2 గంటల్లో 61 వేల పిడుగులు
ఒడిశా(Odisha)లో పిడుగులు(Thunderstorms) బీభత్సం సృష్టించాయి. రెండు గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు...
- By News Desk Published Date - 08:00 PM, Mon - 4 September 23

ఒడిశా(Odisha)లో పిడుగులు(Thunderstorms) బీభత్సం సృష్టించాయి. రెండు గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు ఆ రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. ఈ పిడుగుల ధాటికి 12 మంది దుర్మరణం చెందారని తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఈ అసాధారణ పరిస్థితి నెలకొన్నట్లు వివరించారు.
శనివారం భారీ వర్షాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడగా..గజపతి, జగత్ సింగ్ పూర్, పూరీ, బలంగీర్ తదితర జిల్లాల్లో 12 మందితో పాటు పశువులు కూడా మరణించాయి. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయనున్నట్లు సాహు పేర్కొన్నారు.
రుతుపవనాలు సాధారణ స్థితికి వచ్చినపుడు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఒడిశాలో సెప్టెంబర్ 7 వరకూ ఇవే పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణశాఖ తెలిపింది(IMD). కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. వర్షాలు పడే సమయంలో పొలాల్లో, చెట్ల కింద ఎవరూ ఉండవద్దని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నాలుగు రోజుల వరకూ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
Also Read : Rain Alert Today : ఇవాళ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు పడే ఛాన్స్