Indian Army: లోయలో పడిన మరో ఆర్మీ వాహనం.. మృత్యులోయల డేంజర్ బెల్స్
దీంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సివిల్ క్యూఆర్టీ బృందాలు(Indian Army) రంగంలోకి దిగాయి.
- By Pasha Published Date - 02:30 PM, Sun - 4 May 25

Indian Army: భారత సైన్యంలోని ప్రతీ సైనికుడి ప్రాణమూ ఎంతో విలువైనది. దేశ రక్షణ కోసం సిద్ధమైన సైనికుల త్యాగనిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యేకించి జమ్మూకశ్మీర్‌లో సైనికుల వాహనాలకు.. లోతైన లోయలతో పెనుముప్పు పొంచి ఉంది. చాలాసార్లు ఆర్మీ వాహనాలు అదుపుతప్పి ఆ లోయల్లో పడిపోయాయి. ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. లోయల్లో ఆర్మీ వాహనాలు పడిన ఘటనల్లో ఏటా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరం. తాజాగా ఇవాళ మరో ఆర్మీ వాహనం 700 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు భారత జవాన్లు చనిపోయారు. జమ్మూకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్ వైపునకు వెళ్తుండగా.. అందులోని ఒక వాహనం అదుపుతప్పి లోయలో పడింది. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్‌లుగా గుర్తించారు. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సివిల్ క్యూఆర్టీ బృందాలు(Indian Army) రంగంలోకి దిగాయి. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.
Also Read :Indian Air Force: ప్రధాని మోడీతో వాయుసేన చీఫ్ భేటీ.. కారణం అదేనా ?
ఏప్రిల్ 29న లోయలో పడి..
ఏప్రిల్ 29న కూడా జమ్మూ కశ్మీర్లో అచ్చం ఇలాంటి ప్రమాదమే జరిగింది. సీఆర్‌పీఎఫ్ 181వ బెటాలియన్‌కు చెందిన వాహనం బీర్వా హర్దు పంజూలోని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సిబ్బందిని తీసుకెళ్తుండగా బుద్గాం జిల్లా తంగ్నార్ కొండ ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న జవాన్లను ప్రత్యేక చికిత్స కోసం శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read :Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
మే 3న లోయలో పడి..
మే 3న మధ్యాహ్నం జమ్మూకశ్మీరులోని బందీపొర జిల్లా ఎస్‌కే బాలా ప్రాంతంలోనూ ఒక ఆర్మీ వాహనం 200 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా మూల మలుపులో ఉన్న లోయను వాహన డ్రైవర్ గుర్తించలేకపోయాడు. దీంతో వాహనం నేరుగా వెళ్లి లోయలో పడింది. ప్రమాదకర మూల మలుపు వద్ద ఈ వాహన ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కొత్తగా ఈ మార్గంలో వచ్చే వారు మూల మలుపును గుర్తించలేక ప్రమాదాల బారినపడుతుంటారని చెప్పారు.
మూల మలుపులు, లోయలపై ఫోకస్ పెట్టాల్సిందే
జమ్మూకశ్మీరులోని కొండ ప్రాంతాల్లో ఉన్న మూల మలుపులు, లోయలవద్ద ప్రమాదాలు జరగకుండా భారత సైన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ సూచిక బోర్డులు, డేంజర్ గుర్తుల బోర్డులు వంటివి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చు. ఆర్మీ బడ్జెట్ నుంచే ఈ ఏర్పాట్లకు కేటాయింపులు చేయాలి. తద్వారా మన సైనికుల విలువైన ప్రాణాలు నిలుస్తాయి.