Maharashtra : ఇంకా కొత్త ప్రభుత్వం పై రాని స్పష్టత..రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్ రౌత్
మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 01:20 PM, Wed - 27 November 24

Presidents Rule In Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసిన మహాయుతి కూటమి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించినప్పటికి కూటమి నుంచి సీఎంగా ఎవరుంటారనే ఉత్కంఠ ఇంకా వీడలేదు. గత శాసనసభ గడువు మంగళవారంతో ముగిసినప్పటికీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టాలన్నదానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత అసెంబ్లీ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో మహాయుతి కూటమి విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని సంజయ్ రౌత్ అన్నారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రిని కూడా నిర్ణయించలేదు. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
మరోవైపు నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాదని, కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోయినా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గత అనుభవాలను ఉదాహరణగా పేర్కొంటూ.. గతంలో శాసనసభ గడువు తీరిన తర్వాత ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ లెక్కలో నవంబర్ 26లోపు సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోయినా, కొత్త ప్రభుత్వం కొలువుదీరకపోయినా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
కాగా, మహాయుతి కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడటానికి మార్గం సుగమం చేస్తూ ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. కొత్త సీఎం బాధ్యతలు చేపట్టేవరకూ ఆపద్ధర్మంగా కొనసాగాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ షిండేను కోరారు.
Read Also: vijay paul : విజయ్ పాల్ అరెస్టు సంతోషకరం: రఘురామ కృష్ణరాజు