Renu Desai : స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణు దేశాయ్ సంచలన ట్వీట్
Renu Desai : "ఈ రాజకీయ నాయకులు నిజంగా స్టూపిడ్స్ అనిపిస్తుంది. చివరి వన్య మృగాన్ని చంపే వరకు వీరు ఆగరు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోరు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- By Sudheer Published Date - 10:08 AM, Wed - 6 August 25

ప్రకృతి, జంతువుల పట్ల తన ప్రేమను తరచుగా చాటుకునే నటి రేణు దేశాయ్ (Renu Desai), రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ విషయంలో రాజకీయ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమిపై ఉన్న సహజ వనరులు, జీవరాశులు అంతరించిపోతుంటే, మనిషి తన స్వార్థం, అత్యాశతో వాటిని నాశనం చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం, అడవుల నరికివేత, మైనింగ్ వంటి కార్యకలాపాలతో జంతువుల ఆవాసాలను ధ్వంసం చేయడంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేణు దేశాయ్ ఇటీవల తన కుమార్తె ఆద్య పేరు మీద ఒక పెట్ షెల్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు, ఇది ఆమెకు మూగజీవాలపై ఉన్న ప్రేమని తెలియజేస్తుంది.
రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారనే వార్తలపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టైగర్ జోన్‌లో 11 వేల ఎకరాలలో 50 మైనింగ్ ప్రాంతాలను తెరవాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. గతంలో కేవలం 3 పులులు మాత్రమే ఉన్న ఈ అభయారణ్యంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరింది. ఈ తరుణంలో మైనింగ్ చేపట్టడం వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు ఎక్కడికి పోవాలని, వాటిని చంపేస్తారా అని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
BC Reservations : ఢిల్లీలో రేవంత్ సర్కార్ ధర్నా..42% సాధించేనా?
ఈ పరిస్థితిపై స్పందించిన రేణు దేశాయ్, తన ట్విట్టర్ ఖాతాలో ఘాటుగా స్పందించారు. “ఈ రాజకీయ నాయకులు నిజంగా స్టూపిడ్స్ అనిపిస్తుంది. చివరి వన్య మృగాన్ని చంపే వరకు వీరు ఆగరు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోరు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనిషి స్వార్థపూరిత ఆలోచనల వల్ల భవిష్యత్ తరాలు కూడా ఈ భూమి మీద బతకాల్సి ఉంటుందనే విషయాన్ని వారు గ్రహించడం లేదని ఆమె ప్రశ్నించారు. వారికి కూడా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారని, వారికి మంచి వాతావరణం, సురక్షితమైన భూమిని అందించాల్సిన బాధ్యత లేదా అని ఆమె నిలదీశారు.
రేణు దేశాయ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలకు చాలా మంది మద్దతు పలికారు. ప్రజల ఆందోళనను, జంతు ప్రేమికుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సరిస్కా టైగర్ రిజర్వ్‌లో మైనింగ్‌ను ఆపుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇలాంటి సున్నితమైన అంశాలపై సెలబ్రిటీలు స్పందించడం వల్ల ప్రజల్లో, ప్రభుత్వంలో కూడా ఒక అవగాహన పెరుగుతుందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.