CAA – Supreme Court : 237 సీఏఏ వ్యతిరేక పిటిషన్లకు సమాధానమివ్వండి.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
CAA - Supreme Court : ఇటీవలే మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 అమల్లోకి వచ్చింది.
- By Pasha Published Date - 05:53 PM, Tue - 19 March 24

CAA – Supreme Court : ఇటీవలే మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)-2019 అమల్లోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదాన్ని పొందిన ఈ చట్టాన్ని ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్‌కు కొన్ని రోజుల ముందు మోడీ సర్కారు అమల్లోకి తెచ్చింది. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వాటన్నింటిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కోర్టుకు సమాధానం ఇచ్చేందుకు 3 వారాల గడువు ఇచ్చింది. సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన 237 పిటిషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. సీఏఏ అమలుపై స్టే విధించాలని పలువురు పిటిషనర్లు చేసిన డిమాండ్‌కు సుప్రీంకోర్టు(CAA – Supreme Court) నో చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join
సీఏఏ అమలును సవాల్ చేస్తూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-డీవైఎఫ్ఐ, తృణముల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా మరెంతో మంది మొత్తం 237 పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్-ఐయూఎంఎల్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. 1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2 ను సవరించారు. దాని ప్రకారమే ఆఫ్ఘన్, బంగ్లా, పాక్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్తవులకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. ఆ 3 దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న అక్కడి మైనారిటీలను రక్షించాలన్న ఉద్దేశంతో సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.