Housing Societies : హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది.
- By Latha Suma Published Date - 01:52 PM, Mon - 25 November 24

Supreme Court : జీహెచ్‌ఎంసీ పరిధిలొ హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాజకీయ నాయకులకు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.
ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది.
కాగా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ అనే కాలపరిమితి ఉందా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సొసైటీలకు భూముల కేటాయింపు అనేది చాలా కాలంగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొసైటీల కింద స్థలాలు కేటాయిస్తూ వస్తున్నారు. జూబ్లిహిల్స్ లో కూడా జర్నలిస్టులు, ఐఏఎస్ అధికారుల సొసైటీలకు స్థలాలు కేటాయించారు.
మరోవైపు ఇటీవల జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలను సీఎం అందజేశారు. అయితే తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుతో హౌసింగ్ సొసైటీలు పొందిన ఈ భూముల విషయమై సందిగ్ధత నెలకొంది.