Child Pornographic Material : ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం(Child Pornographic Material), ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
- By Pasha Published Date - 11:44 AM, Mon - 23 September 24

Child Pornographic Material : ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమా ? కాదా ? అనే దానిపై గతంలో మద్రాసు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ‘‘ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరం కాదు’’ అని అప్పట్లో మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం(Child Pornographic Material), ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశంపై గతంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘గతంలో ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదు. అలాంటి తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు తప్పిదం చేసింది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read :Coconuts Price : కొబ్బరికాయల ధర డబుల్.. ఏపీ రైతుల ఆనందం
ఈ తీర్పును వెలువరించే సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదాన్ని ‘ఛైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్’ అనే పదంతో రీప్లేస్ చేస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర సర్కారుకు సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇకపై కోర్టులు ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని ఉపయోగించొద్దని నిర్దేశించింది.
Also Read : HYDRA Demolishing @ Kavuri Hills Park : కావూరి హిల్స్ లో అక్రమాలను కూల్చేస్తున్న ‘హైడ్రా’
ఛైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడనే అభియోగాలను ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదని పోక్సో, ఐటీ చట్టాలు చెబుతున్నాయని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును ఎదుర్కొంటున్న యువకుడు ఛైల్డ్ పోర్న్ వీడియోలను చూడటం తప్ప ఇంకే తప్పు కూడా చేయలేదని తెలిపింది. ఆ పోర్న్ వీడియోలను ఇతరులకు పంపలేదని న్యాయస్థానం చెప్పింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సన్మార్గంలోకి మళ్లించడం మేలని హైకోర్టు గతంలో అభిప్రాయపడింది. ఈ తీర్పుపై కొన్ని ఎన్జీవోలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.