Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్ " పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది.
- By Latha Suma Published Date - 04:46 PM, Thu - 5 June 25

Bangalore : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న విషాద ఘటనపై ఆ జట్టు యాజమాన్యం స్పందించింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు “ఆర్సీబీ కేర్స్ ” పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ వారికి అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తామని ఆర్సీబీ పేర్కొంది.
Read Also: Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారు ఎదుర్కొంటున్నమానసిక గాయం మరియు ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఈ సందర్భంగా ఆర్సీబీ విడుదల చేసిన ప్రకటనలో, ఈ వార్త మాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మేము తక్షణమే మా అన్ని విజయోత్సవ కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా ఈ దుర్ఘటన గురించి తెలిసిన తర్వాతనే మేము స్పందించగలిగాం. పెద్ద సంఖ్యలో అభిమానులు ఒకేచోట గుమికూడటంతో ఈ ఘటన జరిగిందని సమాచారం. మేము మా అభిమానుల క్షేమమే మాకు ప్రాధాన్యం. అందరూ సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని పేర్కొంది. ఇక కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ పరిహారంతో పాటు ప్రభుత్వ స్థాయిలో కూడా క్షతగాత్రులకు వైద్యసాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషాద ఘటనపై దేశవ్యాప్తంగా విషాదం వ్యక్తమవుతోంది. స్టేడియం వద్ద నిర్వహణ లోపాలే దీనికి కారణమని కొంతమంది వాదిస్తున్నారు. ఇకపై ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ జట్టు తీసుకున్న స్పందన పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధిత అభిమానులకు అండగా నిలబడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చర్యలు ఇతర క్రీడా జట్లకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Rafale : హైదరాబాద్‌లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం