Split In NDA : ఎన్‌డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
‘‘నేను గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Split In NDA) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను.
- By Pasha Published Date - 10:41 AM, Tue - 15 April 25

Split In NDA : కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమికి స్వల్ప షాక్ తగిలింది. ఈ ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) గుడ్ బై చెప్పింది. ఈవిషయాన్ని స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్ ప్రకటించారు. ‘‘బిహార్‌లోని అధికార సంకీర్ణ కూటమిలో మేమూ ఉన్నాం. అయితే బీజేపీ, జేడీయూల పెత్తనమే నడుస్తోంది. మా పార్టీ (RLJP)ని విస్మరిస్తున్నారు. తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేవలం ఐదుగురు రాజకీయ పాండవులే బిహార్‌ను ఏలుతున్నారు. ఇకపై మేం ఎన్‌డీఏతో వేగలేం’’ అని పశుపతి కుమార్ పారస్ స్పష్టం చేశారు.
Also Read :Robert Vadra : నేనూ పార్లమెంటుకు వెళ్తా.. రాబర్ట్ వాద్రా కీలక ప్రకటన
ఎన్‌డీఏ.. మాకు ఒక్క లోక్‌సభ సీటూ ఇవ్వలేదు
‘‘2014 నుంచి మేం ఎన్‌డీఏకు మద్దతు ఇస్తున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ అన్యాయాన్ని ఇంకా భరించలేం’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘మా పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తాం. మమ్మల్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీతోనైనా మేం పొత్తు పెట్టుకుంటాం. రాబోయే ఎన్నికల్లో బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయడానికి మా పార్టీ సిద్ధమవుతోంది’’ అని పశుపతి కుమార్ పారస్ ప్రకటించారు.
Also Read :Ashok Gajapathi Raju: గవర్నర్ పదవి రేసులో అశోక్ గజపతిరాజు
లాలూ నాకు చాలా క్లోజ్
‘‘నేను గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Split In NDA) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. లాలూ కుటుంబంతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని కొనసాగిస్తాను. రాజకీయ సంభాషణలకు కూడా తలుపులు తెరిచే ఉన్నాయి’’ అని ఆయన తెలిపారు. ‘‘బిహార్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వం దళిత వ్యతిరేకిలా వ్యవహరిస్తోంది. అది అవినీతితో నిండిపోయింది. మద్యపాన నిషేధ చట్టాల పేరుతో దళితులను వేధిస్తున్నారు. ఈ చట్టాల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న పేదలను విడుదల చేయాలి’’ అని పశుపతి కుమార్ పారస్ డిమాండ్ చేశారు. ‘‘వక్ఫ్ సవరణ చట్టం అనేది మతం పేరుతో హక్కులను హరించే ప్రయత్నం. మా పార్టీ ఆ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తుంది’’ అని ఆయన తెలిపారు. సీఎం నితీష్ కుమార్ మానసిక స్థితి క్షీణిస్తోందన్నారు. ‘‘రాంవిలాస్ పాశ్వాన్ రెండో అంబేద్కర.. ఆయనకు భారతరత్న ఇవ్వాలి’’ అని పశుపతి డిమాండ్ చేశారు.
ఇండియా కూటమికి అనుకూల వేవ్
పై వ్యాఖ్యలను గమనిస్తే.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) బిహార్‌లోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. బిహార్‌లో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి ఇండియా కూటమిలో లాలూ ప్రసాద్‌కు చెందిన ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. వాటితో జతకట్టేందుకు పశుపతి కుమార్ పారస్ రెడీ అవుతున్నారు. ఈసారి బిహార్ ఎన్నికలబరిలో సత్తాచాటాలని ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా ఉవ్విళ్లూరుతోంది. ఆ పార్టీ ఏ కూటమి వైపు మొగ్గుచూపుతుంది అనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. బహుశా ఎన్నికల ఫలితాల తర్వాతే దీనిపై ప్రశాంత్ కిశోర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు బిహర్‌లోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ కన్నేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఆశాజనక స్థాయిలోనే ఓట్లను సాధించారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే.. బిహార్‌లో ఇండియా కూటమికి అనుకూలంగా వేవ్ మొదలైనట్టు కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి లెక్కలన్నీ మార్చేసి పైచేయిని సాధించే సత్తా బీజేపీ పెద్దలకు ఉందని మనం గుర్తుంచుకోవాలి.