NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ - యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- By Pasha Published Date - 01:32 PM, Thu - 18 July 24

NEET UG Paper Leak : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ – యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్కడక్కడ చోటుచేసుకున్న అవకతవకల ప్రాతిపదికన మొత్తం పరీక్షను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. నీట్ – యూజీ ప్రశ్నాపత్రం లీక్(NEET UG Paper Leak) వ్యవహారంపై దాఖలైన దాదాపు 40 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ పిటిషన్లపై రేపటి (శుక్రవారం) నుంచి విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరగా సుప్రీంకోర్టు బెంచ్ ఘాటుగా స్పందించింది. ‘‘ఈ ఏడాది నీట్-యూజీ పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల్లో 131 మందే రీటెస్ట్ కోరుతున్నారు. లక్షల సంఖ్యలో విద్యార్థులు కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. అందుకే వాదనలను ఈరోజు నుంచే ప్రారంభిస్తాం’’ అని స్పష్టం చేసింది. విచారణను శుక్రవారం వరకు కూడా కంటిన్యూ చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI) తెలిపారు. పిటిషన్లు దాఖలు చేసిన విద్యార్థులకు నీట్ యూజీ పరీక్షలో వచ్చిన కనీస మార్కులపై సమాచారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
మే 5న దేశంలోని 4,750 పరీక్షా కేంద్రాల్లో 23.33 లక్షల మంది విద్యార్థులు నీట్- యూజీ పరీక్ష రాశారు. వాటిలో 14 విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. పరీక్షను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతింటాయని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. జాతీయ, రాష్ట్ర, నగర స్థాయిలో అభ్యర్థుల నీట్ యూజీ మార్కులను విశ్లేషించినా.. అసాధారణ ఫలితాలు కనిపించడం లేదని కేంద్ర సర్కారు అంటోంది. ఇప్పటికే దీనిపై కేంద్ర విద్యాశాఖ, నీట్ యూజీ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వేర్వేరుగా సుప్రీంకోర్టు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2024-25 అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహిస్తామని అఫిడవిట్‌లో కేంద్రసర్కారు సుప్రీంకోర్టుకు తెలిపింది.