Shashi-Tharoor: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు అరుదైన గౌరవం
- Author : Latha Suma
Date : 21-02-2024 - 1:13 IST
Published By : Hashtagu Telugu Desk
Shashi-Tharoor:కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్(Shashi-Tharoor)కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో తిరువనంతపురం ఎంపీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. దౌత్యవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన శశిథరూర్.. బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వతహాగా రచయిత అయిన థరూర్.. పలు పుస్తకాలను రాశారు. యూపీఏ హాయంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. వాస్తవానికి ఆగస్టు 2022లో ఫ్రాన్స్ ప్రభుత్వం శశిథరూర్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఏడాదిన్నర తర్వాత మంగళవారం ప్రదానం చేసింది.
‘భారత్-ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి, అంతర్జాతీయ శాంతి, సహకారాన్ని పెంపొందించేందుకు, చాన్నాళ్లుగా ఫ్రాన్స్‌కు స్నేహితుడిగా నిలిచినందుకు గుర్తింపుగా శశిథరూర్‌కు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాం’ అని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఆయన రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ఇస్తున్నట్లు ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్షర్ ప్రకటించారు. పురస్కారం స్వీకరించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా శశిథరూర్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ఫ్రాన్స్, ఆదేశ ప్రజలు, వారి మంచితనం, భాష, సంస్కృతిని, ప్రత్యేకించి వారి సాహిత్యాన్ని, సినిమాలను మెచ్చుకునే వ్యక్తిగా, మీ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని ప్రదానం చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. నా అభిప్రాయం ప్రకారం, ఒక భారతీయుడికి ఈ అవార్డును అందించడం అనేది లోతైన ఫ్రెంచ్-భారతీయ సంబంధాలు, చాలా కాలం ఈ బంధం కొనసాగింపునకు ఒక అంగీకారం.. ’ అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
read also : Fly Overs In India: భారతదేశంలో గరిష్ట సంఖ్యలో ఫ్లై ఓవర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..?
అంతర్జాతీయ సమాజం అభివృద్ధి కోసం రెండు దేశాల మధ్య మరింత సహకారాన్ని ప్రోత్సహించడంలో తన ప్రయత్నాలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇక, ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్’, ‘పాక్స్ ఇండికా’, ది గ్రేట్ ఇండియన్ నావెల్’ వంటి ప్రముఖ రచనలతో పాటు మరికొన్ని పుస్తకాలను థరూర్ రాశారు.