Tamil Nadu : విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య: సీఎం ఎంకే స్టాలిన్
సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు.
- By Latha Suma Published Date - 02:05 PM, Wed - 8 January 25

Tamil Nadu : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై అసెంబ్లీ వేదికగా స్పందించారు. యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన దారుణం ఎవరికీ ఆమోదయోగ్యం కాదని, అది దారుణమని వ్యాఖ్యానించారు. చెన్నైలో విద్యార్థినిపై జరిగిన ఘటనను ఎవరూ ఆమోదించరు. విద్యార్థినిపై లైంగిక దాడి కౄరమైన చర్య అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని కొందరు సభ్యులు మాటిమాటికి అన్నా యూనివర్సిటీ పేరు ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. సభలో చాలామంది సభ్యులు ఒక యూనివర్సిటీ పేరును ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. కానీ నేను ఆ యూనివర్సిటీ పేరును ప్రస్తావించదల్చుకోలేదు. నేను ఆ పేరుకు కళంకం తేవాలనుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఈ సభలో ఉన్నవారిలో చాలామందిని తయారు చేసింది ఆయనే. ఆ భావోద్వేగంతో నేను ఆ పేరును పక్కన పెడుతున్నా అని సీఎం అన్నారు.
మా ప్రభుత్వం బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటుంది. నేరం జరిగిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయకపోయినా, అతడిని కాపాడే ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాన్ని నిందించవచ్చు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసినా, వేగంగా విచారణ చేయిస్తున్నా ప్రభుత్వాన్ని నిందించడమనేది రాజకీయ ప్రయోజనాల కోసమే అని స్టాలిన్ ఆరోపించారు. సభలోని సభ్యులంతా లైంగిక దాడి ఘటనపై మాట్లాడారు. ఒక్కరు తప్ప మిగతా అందరూ నిజమైన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని చెడుగా చూపించడమే ఆ ఒక్క సభ్యుడి పని అన్నారు.
ఇటీవల అన్నా యూనివర్సిటీలో గణశేఖరన్ అనే వ్యక్తి 19 ఏళ్ల విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు క్యాంపస్ భవనం వెనుకాల తన స్నేహితుడితో మాట్లాడుతుండగా నిందితుడు చూశాడు. ఆమె స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఘటనపై విద్యార్థిని తన స్నేహితునితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.