Covid Vaccine : కోవిడ్ వ్యాక్సిన్‌లపై ఆరోపణలపై స్పందించిన సీరం ఇన్‌స్టిట్యూట్
కోవిడ్ వ్యాక్సిన్‌లు పూర్తిగా సురక్షితమైనవే. అవి శాస్త్రీయంగా పరీక్షించి, సమర్థితమైన మార్గాల్లోనే వినియోగంలోకి వచ్చాయి అని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌లు ఆకస్మిక గుండెపోటులకు కారణమని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని AIIMS (ఎయిమ్స్) మరియు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన రెండు సమగ్ర అధ్యయనాల్లో తేలింది.
- By Latha Suma Published Date - 05:44 PM, Thu - 3 July 25

Covid Vaccine : కరోనా వ్యాక్సిన్‌లపై ఇటీవల పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా, కోవీషీల్డ్ వాడినవారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయనే వాదన కొందరినీ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) అధికారికంగా స్పందించింది. కోవిడ్ వ్యాక్సిన్‌లు పూర్తిగా సురక్షితమైనవే. అవి శాస్త్రీయంగా పరీక్షించి, సమర్థితమైన మార్గాల్లోనే వినియోగంలోకి వచ్చాయి అని సంస్థ స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్‌లు ఆకస్మిక గుండెపోటులకు కారణమని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని AIIMS (ఎయిమ్స్) మరియు ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన రెండు సమగ్ర అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయనాల ప్రకారం, ఆకస్మిక మరణాలకు కరోనా టీకాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తేలింది. ఈ నివేదికలను కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా ధృవీకరించింది.
Read Also: USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి!
వాటిలో పేర్కొన్నట్లుగా, వాక్సిన్ తీసుకున్న అనంతరం ఆకస్మిక మరణాలు సంభవించడం అనేక కారణాల వల్ల జరుగుతుంటాయని వెల్లడించారు. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఊబకాయం, ముందు నుంచే ఉన్న గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి సమస్యలే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని ఓ జిల్లాలో గత 40 రోజుల వ్యవధిలో 20 మంది ఆకస్మిక గుండెపోటుతో మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య ఇలాంటి మరణాల వెనుక వ్యాక్సిన్ కారణమా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
వాక్సిన్‌లు ఆరోగ్యానికి హానికరమని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు, అధ్యయన నివేదికలు అపోహలను తొలగించడంలో కీలకంగా మారాయి. సీరం ఇన్‌స్టిట్యూట్, AIIMS, ICMR వంటి సంస్థల స్పష్టీకరణలు ప్రజలకు భరోసా కలిగించాలి. కరోనా సమయంలో వ్యాక్సిన్‌లు కోట్లాదిమంది ప్రాణాలను రక్షించాయన్నది మరిచిపోలేని నిజం. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో, మరియు తీవ్రమైన అనారోగ్య పరిణామాలను తగ్గించడంలో వ్యాక్సిన్‌లు కీలక పాత్ర పోషించాయి. కాబట్టి, ఇప్పుడెలాగైనా వచ్చే ఆరోపణలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలను నమ్మి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అవసరం.
Read Also: Thalliki Vandanam : తల్లికి వందనం రెండో విడత డబ్బుల విడుదలకు డేట్ ఫిక్స్