రూ.400 కోట్లతో వెళ్తున్న కంటెయినర్లను కొట్టేసిన దొంగలు ! అసలు ఎలా సాధ్యం ?
తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
- Author : Sudheer
Date : 27-01-2026 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
Biggest Robbery Of India: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రూ. 400 కోట్ల కంటెయినర్ల దారిదోపిడీ వ్యవహారం ప్రస్తుతం ఒక మిస్టరీగా మారింది. గుజరాత్ నుంచి తిరుపతికి తరలిస్తున్న రెండు భారీ కంటెయినర్లను కర్ణాటకలోని చోర్లా ఘాట్ అడవుల్లో దోపిడీ చేశారన్న వార్త రాజకీయ, పోలీసు వర్గాల్లో ప్రకంపనలు పుట్టించింది. ఈ కేసు డిసెంబరులో మహారాష్ట్రలోని నాసిక్ పోలీసుల వద్ద నమోదైన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారుడైన సందీప్ దత్త పాటిల్ తొలుత రూ. 1000 కోట్ల దోపిడీ జరిగిందని వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత కిడ్నాప్ డ్రామాలు బయటపడటంతో ఈ వ్యవహారంలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది.
అయితే, ఈ దోపిడీ ఘటనపై కర్ణాటక మరియు మహారాష్ట్ర పోలీసుల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగినట్లు చెబుతున్న బెళగావి జిల్లా ఎస్పీ రామరాజన్, అసలు అలాంటి దోపిడీ జరిగినట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కంటెయినర్ నంబర్లు కానీ, బాధితుల ప్రత్యక్ష ఫిర్యాదులు కానీ లేకపోవడంతో దీనిని ‘గాలి వార్త’గా కొట్టిపారేస్తున్నారు. మరోవైపు, మహారాష్ట్ర పోలీసులు తగిన సమాచారం ఇవ్వడం లేదని కర్ణాటక హోంమంత్రి ఆరోపించగా, విచారణకు సహకరించడం లేదని మహారాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఈ అంతర్రాష్ట్ర సమన్వయ లోపం కేసును మరింత జటిలం చేస్తోంది.
ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తరలిస్తున్న నగదు రద్దు చేయబడిన పాత రూ. 2,000 నోట్లని పోలీసులు అనుమానిస్తుండటం. ఒకవేళ అది నిజమైతే, చెల్లుబాటులో లేని అంత భారీ సొమ్మును ఎక్కడికి, ఎవరి కోసం తరలిస్తున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి రాజకీయ రంగు కూడా తోడైంది; ఎన్నికల నిధుల కోసం కాంగ్రెస్ నేతలే ఈ సొమ్మును తరలిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుంటే, అరెస్టైన వారు గుజరాత్‌కు చెందిన వారని, బీజేపీ పాలిత రాష్ట్రాల గుండానే ఈ ప్రయాణం సాగిందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే, ఇది కేవలం దారిదోపిడీనా లేక పెద్ద స్థాయి రాజకీయ కుట్రనా అన్నది సిట్ విచారణలో తేలాల్సి ఉంది.