జన నాయగన్ కు మరో షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2026 - 12:09 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Thalapathy దళపతి విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టివేసింది. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
- సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్
- విజయ్ ‘జన నాయగన్’ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- మరింత ఆలస్యం కానున్న సినిమా విడుదల
- సెన్సార్ బోర్డుకు కౌంటర్ దాఖలుకు సమయం ఇవ్వాలన్న హైకోర్టు
విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు నటించిన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’, సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఓ ఫిర్యాదు ఆధారంగా సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సెన్సార్ బోర్డు నిర్మాతలకు తెలిపింది. దీంతో నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, మార్పుల తర్వాత సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పుపై సెన్సార్ బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ స్టే విధించింది. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, తిరిగి హైకోర్టునే సంప్రదించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు.