India – EU ట్రేడ్ డీల్ ఖరారు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ లో పొగిడిన ప్రధాని మోదీ!
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2026 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
India-EU Trade Deal Sealed భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈరోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు.
- ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు
- వచ్చే ఏడాది నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చే అవకాశం
- భారత్, యూరప్ సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
- 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత తుది రూపం
- భారత్ నుంచి 97 శాతం ఎగుమతులపై సుంకాల రద్దు
ఈ ఒప్పందం రెండు ప్రపంచ దిగ్గజాల మధ్య భాగస్వామ్యానికి చక్కటి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, కీలక సాంకేతికతలు వంటి అంశాలపై కూడా ఇరుపక్షాలు దృష్టి సారించాయి. అమెరికా, చైనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇతర ప్రాంతాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తున్న ఐరోపాకు ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఈ ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.