Repo Rate: రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంపు..
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
- Author : Maheswara Rao Nadella
Date : 07-12-2022 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రెపో రేటు (Repo Rate) 6.25 శాతానికి చేరింది. సోమవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేడు ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో రేట్ల పెంపు వేగాన్ని ఈసారి ఆర్‌బీఐ కాస్త తగ్గించింది. తాజా పెంపుతో అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి.
ప్రస్తుతం రెపో రేటు 2018 ఆగస్టు నాటి స్థాయికి చేరింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. కార్పొరేట్ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగైన స్థాయిలో ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యంగా కేంద్ర బ్యాంకు రెపోరేటును(Repo Rate) ఇప్పటి వరకు ఈ ఏడాది 225 పాయింట్లు పెంచింది. దీంతో మే నెలలో 4.4 శాతంగా ఉన్న కీలక వడ్డీరేటు ఇప్పుడు 6.25 శాతానికి చేరింది.
ద్రవ్యోల్బణం మరికొంత కాలం లక్షిత 4 శాతానికి ఎగువనే ఉండనుందని దాస్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా తమ పోరాటం మాత్రం ఇంకా ఆగలేదని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 6.7 శాతానికి ఎగువనే ఉంటుందని అంచనా వేశారు.2022 అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో 6.6 శాతం, 2023 జనవరి-మార్చిలో 5.9 శాతం, ఏప్రిల్-జూన్‌లో 5 శాతం, జులై- సెప్టెంబరులో 5.4 శాతంగా ఉంటుందని లెక్కగట్టారు.
మరోవైపు దేశ జీడీపీ వృద్ధిరేటు మాత్రం బలంగా ఉంటుందని దాస్ తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను ఆర్‌బీఐ 7 శాతం నుంచి 6.8 శాతానికి కుదించింది. 2022 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.4 శాతం, 2023 జనవరి- మార్చిలో 4.2 శాతంగా వృద్ధిరేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది.
Also Read: Iran: ఇరాన్ లో 1,200 మంది విద్యార్థులపై విషప్రయోగం..!