Gandhi Jayanthi : గాంధీని స్మరిస్తూ విస్మరిస్తున్నాం..
గాంధీ (Gandhi) ఇప్పుడు కరెన్సీ నోట్లలోనూ, విగ్రహాల్లోను మాత్రమే ఉన్నాడు. జయంతి రోజునో, వర్ధంతి రోజునో మనకు తప్పనిసరిగా గుర్తుకొస్తాడు.
- By Hashtag U Published Date - 10:00 AM, Mon - 2 October 23

By: డా. ప్రసాదమూర్తి
October 2nd, Gandhi Jayanthi : మహాత్మా గాంధీ. ఆయన పేరు మనం నిత్యం స్మరిస్తాం. కానీ ఆయన మార్గాన్ని నిత్యం విస్మరిస్తాం. గాంధీ ఇప్పుడు కరెన్సీ నోట్లలోనూ, విగ్రహాల్లోను మాత్రమే ఉన్నాడు. జయంతి రోజునో, వర్ధంతి రోజునో మనకు తప్పనిసరిగా గుర్తుకొస్తాడు. అంతే కాదు మన దేశానికి ఏ విదేశీ అతిథి విచ్చేసినా రాజ్ ఘాట్ దగ్గర మహాత్ముని సమాధిని తప్పనిసరిగా సందర్శించి ఒక పుష్పగుచ్చాన్ని సమర్పించి నమస్కారం పెట్టుకుంటారు. అతిథులను మహాత్ముని సమాధి దగ్గరకు తీసుకువెళ్లి మన నాయకులు కూడా ఆయన పట్ల భక్తిశ్రద్ధలని ప్రకటించి ఆ తర్వాత ఇక ఎవరి పనిలో వాళ్ళు పడిపోతారు.
మహాత్ముడు అంటే విగ్రహం కాదని నోటు మీద బొమ్మ కాదని అందరికీ తెలుసు. మహాత్ముడు అంటే అహింసా మార్గమని, మతసామరస్యం మహాత్ముని మహోన్నత సందేశం అని, సత్యం అతని ఆయుధమని ఇంకా బాగా తెలుసు. కానీ ఆచరణలో మహాత్ముని సందేశాన్ని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నామా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు జవాబు చెప్పలేక తలదించుకోవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join.
అక్టోబర్ 2 గాంధీ జయంతి (Gandhi Jayanthi) అంటే మద్యం కొట్లు, మాంసం కొట్లు బందు పెడతారు. కానీ అసలు బందు పెట్టాల్సింది మనసులో విద్వేష భావాన్ని అని మాత్రం చాలా తెలివిగా మర్చిపోతారు. మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు, ఆయన సిద్ధాంతాలకు మాత్రం తిలోదకాలు ఇచ్చేస్తారు. ఇన్నాళ్లుగా మనం చూస్తున్న తమాషా ఇదే. గాంధీ (Gandhi) మతసామరస్యానికి పెద్దపీట వేశాడు. ఈ దేశంలో హిందూమతంతో పాటు ఇస్లాం మతం, క్రిస్టియానిటీ మొదలైన మతాలకు సమాన ప్రాధాన్యత ఉండాలని ఆయన నొక్కి చెప్పాడు.
అంతే కాదు ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించకపోయినా ఇక్కడ ముస్లింలు ఉండేవారని, ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించకపోయినా ఇక్కడ క్రైస్తవులు ఉండేవారని, కనుక మెజారిటీ మైనారిటీ వాదాలతో కొట్టుకు చావడం దేశానికి క్షేమదాయకం కాదని ఆయన మరీ మరీ హితవు చెప్పి, అదే కారణంతో ప్రాణాలు కూడా ధారపోశాడు. కానీ విచిత్రంగా మనం మహాత్ముని ప్రతి చోటా స్మరించుకుంటూ ఆయన మనకు అందించిన మార్గాన్ని మాత్రం ప్రతిసారీ విస్మరిస్తున్నాం. ఇదే ఈ దేశం ఎదుర్కొంటున్న వైపరీత్యం.
మత ప్రాతిపదిక మీద ప్రజలను విభజించి, మైనారిటీల మీద మెజారిటీలను ఉసిగొలిపి, విద్వేషమే తమ మతమని బాహాటంగా చాటి చెబుతున్న నేతలు మహాత్ముని నామస్మరణకు ఎంతవరకు అర్హులు అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. కానీ ఈ ప్రశ్న వినేది ఎవరు విన్నా జవాబు చెప్పేది ఎవరు? ఆదిపత్యం, అణచివేత, మెజారిటీ వాదం పరిపాలనకు ప్రాణ సూత్రాలుగా మారిపోయిన కాలంలో మహాత్ముడు కేవలం ఒక బొమ్మగా మాత్రమే మిగిలాడు అని చెబితే అతిశయోక్తి కాదు.
Also Read: Hyderabad: మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో 100 ఫోన్లు మాయం
పార్లమెంటు సాక్షిగా విద్వేష విషాన్ని వెళ్లగక్కుతున్న నాయకులను మనం ఇప్పుడు చూస్తున్నాం. మైనారిటీ మతస్తులను బహిరంగంగా హెచ్చరిస్తున్న నేతల రీతులను నిత్యం మనం వింటున్నాం. దేశం నుంచి ఒక మతంవారిని వెలివేసే చట్టాలనే చేస్తున్న పాలకులను మనం కంటున్నాం.
మరి మహాత్ముడు ఈ దేశంలో బ్రతికి ఉన్నాడని ఎలా చెప్పగలం? కత్తి, డాలూ పట్టకుండా మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించిన ఆ సబర్మతి మహర్షిని మనం స్మరిస్తూ విస్మరిస్తున్నాం, విస్మరిస్తూ స్మరిస్తున్నాం. మైనారిటీల ధార్మిక స్థలాల కూల్చివేతలు ఇక్కడ సర్వసాధారణం. దాడులు దమననీతులు అతి సామాన్యం. ఇవన్నీ గోప్యంగానో రహస్యంగానో జరిగితే ఒకరకం. అలా కొనసాగడం తమ రాజనీతిలో ఒక భాగం అని, అదే తమ ధార్మిక విధానమని బహిరంగంగానే విద్వేష ప్రదర్శన సాగించేవారు నానాటికి ఎక్కువ అవుతున్నారు.
దేశం రాను రాను ఒక సంకట స్థితికి నెట్టి వేయబడుతోంది. విభిన్న జాతులు మతాల మధ్య సామరస్యం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని, భిన్నత్వంలో ఏకత్వమే మన సంస్కృతి, సంప్రదాయమని జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు ఘోషించి చెప్పారు. అయినా వినేవారెక్కడ? గాంధీ జయంతి (Gandhi Jayanthi) రోజున మాత్రం ఆయన విగ్రహాలకు పూజలు చేస్తారు. పాటలు పాడతారు. జేజేలు పలుకుతారు. ఆయన చూపిన శాంతి, అహింస, సత్య పథం మాత్రం తమ మార్గం కాదని తేల్చి చెప్పేస్తారు. మరి ఇంతటి విషాద విపత్కర సన్నివేశంలో గాంధీ జయంతికి ఎంత ప్రాధాన్యత ఉందో దేశమే ఆలోచించుకోవాలి.
Also Read: Gandhi Jayanti 2023 : మహాత్మా.. నీ బాటలో నడిచే బలమివ్వు