Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ
మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు.
- By Pasha Published Date - 02:48 PM, Thu - 29 August 24

Bharat Dojo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్ డోజో యాత్ర ఉంటుంది అంటూ ఆయన ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియో క్లిప్స్ అందులో ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణనిచ్చే కేంద్రాలను ‘డోజో’ అని పిలుస్తారు. అందుకే తాను తదుపరిగా చేపట్టబోయే యాత్రకు ‘భారత్ డోజో యాత్ర’(Bharat Dojo Yatra) అని రాహుల్ గాంధీ పేరు పెట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ యాత్ర ద్వారా మార్షల్ ఆర్ట్స్ కేంద్రాలలో శిక్షణపొందే యువతను రాహుల్ కలుస్తారేమో అని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ రెండు విడతల్లో భారత్ జోడో యాత్రను నిర్వహించారు. తద్వారా దేశంలోని చాలా రాష్ట్రాలను కనెక్ట్ చేశారు. ఎంతోమంది ప్రజలకు చేరువయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పార్టీలకు మంచి ఫలితాలు రావడానికి భారత్ జోడో యాత్ర కూడా దోహదం చేసిందనేది విస్పష్టం. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ నెక్ట్స్ చేపట్టబోయే యాత్ర అనేది అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Also Read :Richest Indian : అంబానీని దాటేసిన అదానీ.. శ్రీమంతుల లిస్టులోకి షారుక్
రాహుల్‌గాంధీని మెచ్చుకున్న స్మృతీ ఇరానీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని మెచ్చుకున్న రాజకీయ ప్రత్యర్ధుల జాబితాలో మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు. రాజకీయంగా రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తన గెలుపును రాహుల్ ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నారని స్మృతీ ఇరానీ చెప్పారు. పార్లమెంటులోకి తెల్ల టీషర్ట్ వేసుకుని వెళ్లడం ద్వారా యువతకు రాహుల్ ఓ సందేశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఇతర రాజకీయ నాయకుల కంటే భిన్నంగా రాహుల్ గాంధీ ముందుకుపోతున్నారని తెలిపారు.