Bihar Polls: బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబంలో కలహాలు!
లాలూ యాదవ్ కుటుంబం, రాష్ట్రీయ జనతా దళ్‌లో చీలిక ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. అయితే గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు మారిన తీరు చూస్తుంటే RJDలో అంతర్గతంగా పరిస్థితులు అస్సలు సరిగా లేవని స్పష్టమవుతోంది.
- By Gopichand Published Date - 06:20 PM, Sat - 15 November 25
Bihar Polls: బీహార్ ఎన్నికల్లో (Bihar Polls) రాష్ట్రీయ జనతా దళ్ (RJD)కు ఎదురైన ఘోర పరాజయం (25 స్థానాలకే పరిమితం కావడం) రాజకీయంగా, వ్యక్తిగతంగా పెద్ద ప్రభావాన్ని చూపుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబంలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశారు.
రోహిణి ఆచార్య సంచలన ప్రకటన
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు, అలాగే కుటుంబంతో కూడా దూరం పాటించనున్నట్లు ప్రకటించారు. ఆమె ‘ఎక్స్’ (X) వేదికగా పోస్ట్ చేస్తూ తాను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్లు, తన కుటుంబానికి కూడా దూరమవుతున్నట్లు తెలిపారు. ఆమె ప్రకటన RJD శిబిరంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఎన్నికల ఓటమి నేపథ్యంలో కుటుంబ వివాదం బయటపడటం పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
Also Read: IPL 2026 Retentions: ఐపీఎల్ 2026 వేలానికి ముందు అన్ని జట్ల రిటెన్షన్ జాబితా విడుదల!
బీజేపీ నేత స్పందన
రోహిణి ప్రకటనపై బీజేపీ నాయకుడు ప్రదీప్ భండారి కూడా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆయన ఇలా రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన ‘కుటుంబం వర్సెస్ కుటుంబం’ అనే జోస్యం నిజమవుతోంది. RJDలోని అంతర్గత సంక్షోభం ఇప్పుడు బహిరంగంగా బయటపడింది అని పేర్కొన్నారు. రోహిణి ఆచార్య తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. నేను రాజకీయాలు వదిలేస్తున్నాను. నా కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను ఇదే చేయమని కోరారు. నేను మొత్తం నిందను నాపై వేసుకుంటున్నాను అని అన్నారు.
కుటుంబ కలహాలు బహిర్గతం
లాలూ యాదవ్ కుటుంబం, రాష్ట్రీయ జనతా దళ్‌లో చీలిక ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. అయితే గత కొంతకాలంగా రాజకీయ పరిణామాలు మారిన తీరు చూస్తుంటే RJDలో అంతర్గతంగా పరిస్థితులు అస్సలు సరిగా లేవని స్పష్టమవుతోంది. ఈ సంఘటనలు పార్టీ లోపలి బలహీనతను బయటపెట్టాయి. లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే పార్టీ, కుటుంబం నుంచి బయటకు వెళ్లిపోయారు. స్వయంగా లాలూ యాదవ్ అతన్ని బహిష్కరించారు. దీని తర్వాత తేజ్ ప్రతాప్ బీహార్ ఎన్నికలకు ముందు తన సొంత పార్టీ ‘జనశక్తి జనతా దళ్’ను స్థాపించి RJDకి వ్యతిరేకంగా బహిరంగంగా పోటీ చేశారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా స్థానం నుంచి ఓటమిపాలయ్యారు.