Milk Prices: పాల ధరలు కూడా పెరిగాయి.. ఏడాది కాలంలో 10 శాతం పెరిగిన రేట్స్..!
కొంతకాలంగా టమాటా, పచ్చి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర (Milk Prices) కూడా భారీగా పెరిగింది.
- Author : Gopichand
Date : 12-08-2023 - 6:24 IST
Published By : Hashtagu Telugu Desk
Milk Prices: ద్రవ్యోల్బణం కారణంగా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సామాన్యుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. కొంతకాలంగా టమాటా, పచ్చి కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పాల ధర (Milk Prices) కూడా భారీగా పెరిగింది.
ఏడాది పొడవునా విజృంభణ
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలో పాల ధర 10 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో టోన్డ్ మిల్క్ ధరలు అంతకు ముందు సంవత్సరం అంటే జూన్ 2022 కంటే 9 శాతం ఎక్కువగా ఉన్నాయని, ఫుల్ క్రీమ్ మిల్క్ ధరలు జూన్ 2023లో అంతకు ముందు సంవత్సరం కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పిటిఐ నివేదిక ప్రకారం.. మంత్రి రూపాలా పార్లమెంటు ఎగువ సభలో ఎన్‌డిడిబి డేటాను ఉదహరించారు. గత మూడేళ్లలో పాల ధరలు పెద్దగా పెరగలేదని చెప్పారు. జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి అందిన సమాచారం ప్రకారం గత మూడేళ్లుగా పాల ధరలు పెద్దగా పెరగలేదన్నారు.
ధర చాలా పెరిగింది
అయితే, గత ఏడాది గణాంకాలు భిన్నమైన చిత్రాన్ని అందిస్తున్నాయి. జూన్ 2022లో టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 47.4. ఇప్పుడు టోన్డ్ మిల్క్ లీటరు రూ.51.6గా మారింది. ఈ విధంగా టోన్డ్ మిల్క్ ధరలు ఏడాదిలో 8.86 శాతం పెరిగాయి. మరోవైపు, ఫుల్ క్రీమ్ మిల్క్ విషయానికొస్తే జూన్ 2022లో లీటరుకు రూ.58.8గా ఉన్న ధరతో పోలిస్తే లీటరుకు 9.86 శాతం పెరిగి రూ.64.6కి చేరుకుంది.
Also Read: Onion : సామాన్య ప్రజలారా..ఇప్పుడే ఉల్లిపాయలను తెచ్చుకోండి..ఎందుకంటే
ప్రభుత్వం నియంత్రించడం లేదు
దేశంలో పాల ధరలను పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ నియంత్రించడం లేదని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. దేశంలో పాల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణ లేదని అన్నారు. దీని ధరలను సహకార, ప్రైవేట్ డెయిరీలు వాటి ధర, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయిస్తాయన్నారు.
ఉల్లి కూడా ఖరీదైనది
గత కొన్ని నెలలుగా దేశంలో అనేక ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా పలు నగరాల్లో కిలో ధర రూ.200 దాటడంతో రూ.300 వరకు వెళ్లే అవకాశం ఉంది. పచ్చి కూరగాయలు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. మసాలా దినుసుల ధరలు కూడా మండిపోతున్నాయి. ఇప్పుడు వచ్చే 1-2 నెలల్లో ఉల్లి ధరలు రెట్టింపు అవుతాయని కూడా ప్రజలు భయపడుతున్నారు.