India Japan Bilateral Talks : మోడీ, జపాన్ పీఎం కీలక భేటీ
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటనకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- Author : CS Rao
Date : 19-03-2022 - 5:27 IST
Published By : Hashtagu Telugu Desk
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటనకు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలు ఆంక్షలను రష్యాపై జపాన్ విధించింది. శరణార్థులను జపాన్ ఆహ్వానిస్తోంది. అయితే రష్యా చేస్తోన్న యుద్ధాన్ని ఖండించకుండా ఉన్న నాలుగు క్యాడ్ దేశాలలో భారత్ ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ పీఎం భారత్ కు రావడం కీలకంగా మారింది.రెండు రోజుల భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు శనివారం భారత్ లో ప్రారంభం అయింది. ఆ వేదికపై నుంచి అంతర్జాతీయ ఐక్యత ప్రాముఖ్యతను చెప్పడమే ప్రధాన ఎజెండాగా జపాన్ పీఎం పెట్టుకున్నాడు. అందుకోసం జపాన్ , భారతదేశం కలిసి పని చేస్తాయని చెప్పడానికి భారత్ పర్యటనకు వచ్చాడు. ఆ విషయాన్ని కిషిడా మీడియాకు వెల్లడించాడు.“భారత ప్రధాని మోడీతో, జపాన్, భారతదేశం, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ నాయకుల మధ్య టోక్యోలో జరగనున్న క్వాడ్ సమ్మిట్ సమావేశాన్ని విజయవంతం చేయడానికి కిషిడా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం ఇరుపక్షాలు భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నట్లు జపాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “భారతదేశం మరియు జపాన్‌లు తమ ‘ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం’ పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయి. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడంతో పాటు బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఈ సదస్సు ఇరుపక్షాలకు అవకాశం కల్పిస్తుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం తో పాటు వెలుపల కూడా శాంతి, స్థిరత్వం . శ్రేయస్సు కోసం ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలకంగా జపాన్ పీఎం ఎజెండాను ఫిక్స్ చేసుకున్నాడు. సో..జపాన్ పీఎం భారత్ టూర్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చేస్తున్నాయన్నమాట.