PM Modi : టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi : టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీన్ని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయడం కూడా ఇదే తొలిసారి. స్పెయిన్ లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్ కు చేరుకుంటున్నాయి.
- By Latha Suma Published Date - 01:13 PM, Mon - 28 October 24

TATA Aircraft Complex : స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అక్కడ రోడ్‌షోలో పాల్గొన్నారు. తరువాత గుజరాత్‌లోని వడోదరలోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ క్యాంపస్‌లో సి-295 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రారంభించారు.
టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ దీన్ని నెలకొల్పింది. ఐరోపాకు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ లను తయారు చేయడం కూడా ఇదే తొలిసారి. స్పెయిన్ లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్ కు చేరుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీమాట్లాడారు.
ఈ ప్లాంట్ మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్ ను బలోపేతం చేస్తుందన్నారు. భారత్-స్పెయిన్ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్ తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళ్తున్నామని మోడీ వెల్లడించారు. ఈమధ్యే భారత్ రతన్ టాటాను కోల్పోయింది. ఆయన జీవించి ఉంటే నేడు ఇక్కడ మన మధ్య ఉండేవారు. ఎక్కడున్నా ఆయన దీనిని చూసి సంతోషిస్తారు అని మోదీ నివాళులర్పించారు.
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మాట్లాడారు. ఎయిర్ బస్, టాటాల భాగస్వామ్యం భారత వైమానిక రంగం పురోగతికి బాటలు వేస్తుందని అన్నారు. ఇతర ఐరోపా దేశాలు భారత్ కు వచ్చేందుకు ఇది ద్వారాలను తెరిచిందని పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోడీ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ చారిత్రాత్మక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను సందర్శించి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం, శాంచెజ్ స్పెయిన్‌కు తిరిగి వెళ్లనున్నారు.