PM Modi: ‘పరమ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
PM Modi: సాంకేతిక విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని తెలిపారు.
- By Latha Suma Published Date - 07:37 PM, Thu - 26 September 24

PARAM Rudra supercomputers: వాతావరణ మరియు వాతావరణ పరిశోధనల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం వర్చువల్‌గా మూడు ‘పరమ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం రూ.130 కోట్లతో పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఏర్పాటు చేశారు. వాతావరణ పరిశోధనల కోసం రూ.850 కోట్లతో రూపొందించిన హై-పెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను సైతం ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును శాస్త్ర, సాంకేతిక రంగంలో చాలా గొప్ప విజయాలు సాధించిన రోజుగా పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi : దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా?: రాహుల్‌గాంధీ
సాంకేతిక విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని తెలిపారు. ఈ సాంకేతిక విప్లవంలో మన వాటా బిట్స్, బైట్స్‌లో కాదు.. టెరా బైట్లు, పెటా బైట్లలో ఉండాలన్నారు. భారతదేశం సైన్స్, టెక్నాలజీ, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సొంతంగా సెమీకండక్టర్ ఎకో సిస్టమ్‌ను నిర్మించడంతో పాటు ప్రపంచంలోని సరఫరా గొలుసులో కీలకంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సైన్స్ ప్రాముఖ్యత కేవలం ఆవిష్కరణలు, అభివృద్ధి వరకే పరిమితం కారాదన్న ప్రధాని.. దేశంలో ఆఖరి పౌరుడి ఆకాంక్షలను సైతం నెరవేర్చేలా ఉండాలన్నారు.
కాగా, సూపర్‌కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ సూపర్‌కంప్యూటర్‌లను దేశానికి అంకితం చేయనున్నట్లు అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది. వివిధ రంగాల కోసం రూ. 22,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ అంకితం చేయనున్న కార్యక్రమంలో భాగంగా పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రారంభించారు. అయితే ముంబై, పూణేలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈవెంట్ వాయిదా పడింది.