Petrol Price Hike : 125రూపాయలకు చేరనున్న లీటర్ పెట్రోల్..?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపధ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది
- Author : Hashtag U
Date : 03-03-2022 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపధ్యంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. నిన్న(మార్చి 2, 2022) నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర 111 డాలర్లకు చేరుకోవడంతో మన దేశంపై కూడా దాని ప్రభావం పడబోతోందని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల కనిష్ట స్ధాయికి క్రూడాయిల్ ధరలు చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై దీని ప్రభావం పడబోతోంది.
అయితే, ఈ పాటికే మన దేశంలో రేట్లు పెరగాల్సి ఉన్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల వల్ల నిలిచిపోయినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 7వ తారీఖున ఎన్నికల ప్రక్రియ పూర్తికావస్తుండడంతో 8వ తారీఖు పెట్రోల్ ధరలు పెరగవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పుడు ధరలను పెంచితే ప్రభుత్వంపై ఓటర్లలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ధరల పెంపు జోలికి వెళ్లలేదని చెపుతున్నారు.
వాస్తవానికి బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్లకు చేరేసరికే పెట్రోలియం కంపెనీలకు లీటర్ పెట్రోల్ పై రూ. 9 నష్టం వస్తోందని చెపుతున్నారు. ఇప్పుడు బ్యారెల్ ధర 111 డాలర్లను మించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలను బాగానే పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్నిట్యాక్స్‌లతో కలిపి లీటర్ పెట్రోల్ ధర రూ. 120 – 125కి చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.