Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్‌కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
- By Sudheer Published Date - 08:03 PM, Tue - 29 July 25

లోక్‌సభ మాన్సూన్ సమావేశాల్లో (Parliament Monsoon Session) ఆపరేషన్ సిందూర్ (Operation sindoor ) చర్చకు కేంద్రబిందువుగా మారింది. విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్‌కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు. “పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టినపుడు దేశం సంబరాలు చేసుకుంది. మతం అడిగి మరీ అమాయకులను చంపిన ఆ దారుణానికి భారత్ ఘాటు బదులు ఇచ్చింది” అని మోదీ స్పష్టం చేశారు.
భారత దళాల దాడులతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్, యుద్ధం ఆపాలని మన డీజీఎంఓకి స్వయంగా కాల్ చేసి విజ్ఞప్తి చేసిందని ప్రధాని వెల్లడించారు. “ఇక తట్టుకోలేం, మమ్మల్ని వదిలేయండి” అని పాక్ చిత్తశుద్ధితో దయాపూరితంగా అడిగిందని చెప్పారు. అలాగే మే 9న అమెరికా వైస్ ప్రెసిడెంట్ తనకు ఫోన్ చేసి, పాక్ భారీ దాడులకు సిద్ధమవుతోందని హెచ్చరించినప్పటికీ, తాను ధైర్యంగా స్పందించానని మోదీ తెలిపారు. “పాక్ ఏం చేసినా తాను తగిన మూల్యం చెల్లించుకుంటుందని స్పష్టం చేశా” అని పేర్కొన్నారు.
Breakup : బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మీరు ఫుల్ హ్యాపీ
భారత్ యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం అని పునరుద్ఘాటించిన ప్రధాని మోదీ, ఆయుధాలు శాంతి కోసం మాత్రమే అని అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు గత 11 ఏళ్లలో 30 రెట్లు పెరిగాయని, ‘మేడ్ ఇన్ ఇండియా’ మిస్సైళ్లు, డ్రోన్లు విదేశీ మార్కెట్లలో డిమాండ్ సొంతం చేసుకున్నాయని చెప్పారు. ప్రైవేట్ రంగానికి తలుపులు తెరచిన కారణంగా దేశ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. కానీ ఈ దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ, పాక్‌కు క్లీన్చిట్ ఇస్తూ మాట్లాడడాన్ని మోదీ దుయ్యబట్టారు.
అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకూ మోదీ కౌంటర్ ఇచ్చారు. యుద్ధం ఆపాలని తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఆపరేషన్ సిందూర్ పూర్తిగా భారత్ యోచనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. ఈ “సర్జికల్ స్ట్రైక్స్ సమయంలోనూ, అభినందన్ విషయానికీ అదే పరిస్థితి. ప్రతిసారీ దేశ శత్రువులను గౌరవించి దేశ రక్షకులను ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది” అని విమర్శించారు. “పాకిస్థాన్ కు కేవలం మూడు దేశాలు మద్దతిచ్చినా, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం దానికి అండగా నిలుస్తోంది” అని మోదీ తీవ్రంగా పేర్కొన్నారు.