Snow Rain : హిమాచల్ ప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి.
- By Latha Suma Published Date - 01:34 PM, Thu - 26 December 24
Snow Rain : చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజలాడుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి.
మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక..173 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లో మైనస్ 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
కాగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో త్యుని-చక్రతా-ముస్సోరీ జాతీయ రహదారి, ధరణాధర్-కోటి కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. మండి, మనాలి, చంబా, ఉనా, హమీర్‌పూర్ మరియు సుందర్‌నగర్‌లలో తీవ్రమైన చలిగాలులు కొనసాగుతుండగా, సుందర్‌నగర్ మరియు మండిలో వరుసగా దట్టమైన మరియు మోస్తరు పొగమంచు కనిపించింది.
Read Also: India vs Australia: తొలిరోజు ముగిసిన ఆట.. ఆసీస్ స్కోర్ ఎంతంటే?