Mallikarjun Kharge : ఈవీఎంలలో ఆ మార్పులు చేశారు.. ఖర్గే సంచలన ఆరోపణలు
వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. హర్యానాలోనూ అదే విధంగా జరిగింది’’ అంటూ ఖర్గే(Mallikarjun Kharge) ధ్వజమెత్తారు.
- By Pasha Published Date - 01:11 PM, Wed - 9 April 25

Mallikarjun Kharge : ఈవీఎంలతో జరుగుతున్నదంతా మోసమేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా, విపక్ష పార్టీలకు నష్టం జరిగేలా ఈవీఎంలలో మార్పులు చేయించుకున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. బ్యాలట్ పేపర్‌తో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Telugu States Alert : ఏపీ, తెలంగాణలకు అలర్ట్.. వర్షాలు, పిడుగుపాట్లు, ఈదురుగాలులు
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మోసం : కాంగ్రెస్ చీఫ్
‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను మోసపూరితంగా ఓడించారు. ఆశ్చర్యకరంగా మహారాష్ట్రలో బీజేపీకి 90 శాతం అసెంబ్లీ సీట్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఆ పార్టీకి అన్ని సీట్లు రానే లేదు. ఇదంతా మోసం వల్లే సాధ్యమైంది. వాళ్లు ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. హర్యానాలోనూ అదే విధంగా జరిగింది’’ అంటూ ఖర్గే(Mallikarjun Kharge) ధ్వజమెత్తారు. ‘‘మేం తప్పకుండా నిజాన్ని బయటపెడతాం. దొంగ తప్పకుండా దొరుకుతాడు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘యావత్ ప్రపంచం ఈవీఎంల నుంచి బ్యాలట్ పేపర్ వైపుగా మారుతుంటే, ఇంకా మనదేశంలో ఈవీఎంలను వినియోగిస్తుండటం విడ్డూరంగా ఉంది’’ అని ఖర్గే చెప్పారు. ‘‘గత 11 సంవత్సరాలుగా భారత రాజ్యాంగంపై అధికార బీజేపీ దాడి చేస్తోంది. రాజ్యాంగ సంస్థలు, సూత్రాలపై దాడి చేస్తోంది. వాటిని రక్షించడానికి మనం పోరాడాలి’’ అని కాంగ్రెస్ చీఫ్ పిలుపునిచ్చారు.
Also Read :Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
ఈసారి ఏఐసీసీ సెషన్‌లో..
- ఇవాళ ఏఐసీసీ సెషన్‌లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు. ఆయన 2024 డిసెంబరులో కన్నుమూశారు.
- చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ఏఐసీసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించారు.
- ‘న్యాయ్ పథ్ : సంకల్ప్, సమర్పణ్ ఔర్ సంఘర్ష్’ అనే నినాదంతో ఈసారి అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సెషన్‌లో 1700 మందికిపైగా కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొంటున్నారు.