No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?
విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్‌ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
- By Pasha Published Date - 02:20 PM, Tue - 10 December 24

No Confidence Motion : రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఇవాళ రాజ్యసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు అవసరముండగా.. విపక్ష కూటమికి చెందిన 70 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతుగా సంతకాలు చేసినట్లు తెలిసింది. ఈ అవిశ్వాస తీర్మానానికి సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా ఇండియా కూటమిలోని ముఖ్య పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయని సమాచారం. అవిశ్వాస తీర్మానం నోటీసును రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పి.సి.మోడీకి ఇండియా కూటమి పార్టీలు అందజేశాయి. దీనిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ ఒక ట్వీట్ చేశారు. ‘‘వాస్తవానికి మేం ఈ ఏడాది ఆగస్టులోనే జగదీప్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావించాం. కానీ మరోసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో అప్పట్లో ఆగిపోయాం. మా ఆలోచనను విరమించుకున్నాం. ఇప్పటికీ రాజ్యసభ ఛైర్మన్ వైఖరి మారలేదు. ఆయన సభలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సోమవారమే ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. 70 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు’’ అని జైరాం రమేశ్ వెల్లడించారు.
Also Read :Reliance Loan : రిలయన్స్‌కు రూ.25వేల కోట్ల లోన్.. బ్యాంకులతో ముకేశ్ అంబానీ చర్చలు
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఈసందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్‌ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. అనవసరమైన విషయాలపై సభలో చర్చకు అవకాశం కల్పిస్తూ.. విపక్షాలు సూచించే అంశాలను ఉద్దేశపూర్వకంగా ధన్‌ఖర్ పక్కకు పెడుతున్నారని ఖర్గే ఆరోపించారు. ఉప రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని కాంగ్రెస్ నాయకురాలు రణజీత్ రంజన్ మీడియాకు వెల్లడించారు.
Also Read :Human Rights Day 2024 : మానవ హక్కులకు జై.. సామాజిక అసమానతలకు నై
మరోవైపు లోక్‌సభలోనూ విపక్షాల నిరసనకు దిగాయి. అదానీ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. విపక్ష సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తంచేశారు. సభ నిర్వహణకు సహకరించాలని విపక్ష సభ్యులను ఆయన కోరారు. అయినా విపక్షాలు నిరసనలను, నినాదాల హోరును కొనసాగించాయి. దీంతో రాజ్యసభతో పాటు లోక్‌సభ కూడా రేపటికి వాయిదా పడ్డాయి.