INDIA bloc : ‘ఇండియా’ సారథిగా మమతా బెనర్జీ.. ? ఆ పార్టీల మద్దతు దీదీకే !
ఇండియా కూటమికి(INDIA bloc) సారథ్యం వహించే అంశంపై కాంగ్రెస్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా సూచించారు.
- By Pasha Published Date - 07:02 PM, Sat - 7 December 24

INDIA bloc : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఛాన్స్ వస్తే తాను ఇండియా కూటమికి సారథ్యం వహిస్తానని ఆమె ప్రకటించారు. అయితే దీనిపై విపక్ష కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆమెకు మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (ఉద్ధవ్) నేతలు మాట్లాడుతున్నారు. సీఎం మమతకు ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను అప్పగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ వ్యవహారాల అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అందుకే మమతకు మద్దతివ్వాలని కూటమిలోని అన్ని పార్టీలను తాము కోరుతున్నట్లు ఉదయ్‌వీర్ సింగ్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్సేనని ఆయన ఫైర్ అయ్యారు.
Also Read :World Billionaires 2024 : భారత్‌లో 185 మంది బిలియనీర్లు.. వీరిలో 108 మంది ఎవరంటే ?
- ఇండియా కూటమికి(INDIA bloc) సారథ్యం వహించే అంశంపై కాంగ్రెస్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా సూచించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల మాట విని ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవన్నారు.
- ఇండియా కూటమి పగ్గాలను మమతకు అప్పగించాలని తాము కోరుకుంటున్నట్లు శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఒకవేళ మమతను వద్దు అనుకుంటే.. అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రేలలో ఎవరికి ఇండియా కూటమి బాధ్యతలను అప్పగించినా తాము కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై మమతా బెనర్జీతో చర్చలు జరిపేందుకు త్వరలో కోల్‌కతాకు వెళ్తామని రౌత్ వెల్లడించారు.
- ఈ అంశంపై ఆర్జేడీ మరోలా స్పందించింది. ఇండియా కూటమికి లాలూ ప్రసాద్ యాదవ్ సారథి అయితే చాలా బాగుంటుందని పేర్కొంది.
Also Read :Samajwadi Vs MVA : ఎంవీఏకు షాక్.. కూటమి నుంచి ‘సమాజ్‌వాదీ’ ఔట్.. కారణమిదీ
రాజకీయ వారసులపై దీదీ కీలక కామెంట్స్
తన రాజకీయ వారసులు ఎవరు ? అనే దానిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వమే కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తమ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఏది మంచిదో అది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. టీఎంసీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ఉన్నారని.. అందరినీ కలుపుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.