Rs 3500 Crore : కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ శాఖ
Rs 3500 Crore : ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
- By Pasha Published Date - 04:28 PM, Mon - 1 April 24

Rs 3500 Crore : ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.3500 కోట్ల (Rs 3500 Crore) పన్ను బకాయిల విషయంలో జులై 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోబోమని దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఆదాయపన్ను శాఖ తెలిపింది. ఇప్పటికే పన్ను బకాయిలను చూపించి కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఆదాయపు పన్ను శాఖ రికవరీ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తొలుత హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించలేదు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీకి కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి బకాయిల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగదని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 24కు వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join
2017-2018 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-2021 ఆర్థిక సంవత్సరం వరకు పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి నోటీసు పంపిన ఐటీ శాఖ..తాజాగా ఆదివారం రూ. 1744 కోట్లు కట్టాలని మరో నోటీసు పంపింది. 2014-15 నుంచి 2016-17 అసెస్‌మెంట్ సంవత్సారాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని ఆ నోటీసులో పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల వేళ పన్ను ఉగ్రవాదంతో ప్రధాన ప్రతిక్షాలను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఇదే విషయంపై ఈసీకి కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.