Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నేవీ డీప్ డైవర్లు(Assam Coal Mine) వెళ్లారు.
- By Pasha Published Date - 08:12 AM, Wed - 8 January 25

Assam Coal Mine: సోమవారం రోజు (జనవరి 6వ తేదీన) ఆ బొగ్గు గనిలోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవేశించింది. అసోంలోని దీమా హసావు జిల్లా ఉమ్రాంగ్సో సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ గనిలో 9 మంది బొగ్గు గని కార్మికులు చిక్కుకుపోయారు. సోమవారం నుంచి వారంతా దాదాపు 100 ఫీట్ల అడుగున ఉన్న గనిలోనే ఉన్నారు. దీంతో వారిలో ఎంతమంది బతికి ఉన్నారు ? ఎంతమంది చనిపోయారు ? అనే దానిపై ఆందోళన నెలకొంది. వారంతా ప్రాణాలతో తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్‌ను అసోం ప్రభుత్వం వేగవంతం చేసింది. భారత నౌకాదళానికి చెందిన డీప్ డైవర్లు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) డీప్ డైవర్లు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) డీప్ డైవర్లు కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సహాయక చర్యలకు నేవీ డీప్ డైవర్ల టీమ్ సారథ్యం వహిస్తోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నేవీ డీప్ డైవర్లు(Assam Coal Mine) వెళ్లారు.
Also Read :Venkatesh : వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బిజినెస్ లెక్కలివే..!
తొలుత ఆ గనిలో నుంచి వరద నీటిని తొలగించే ప్రక్రియ జరుగుతోంది. ఆ తర్వాతే అందులో చిక్కుకున్న కార్మికుల యోగ క్షేమాల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ గని మొత్తం వ్యాసార్ధం 20 అడుగులు. ఇది దాదాపు 300 అడుగుల లోతులో ఉంది. అకస్మాత్తుగా గనిలోకి వరదనీరు ఎందుకు పోటెత్తిందో తెలియరాలేదు. ఈవివరాలతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అది అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఆయన వెల్లడించారు. గనులు, ఖనిజాల చట్టం, 1957లోని సెక్షన్ 21(1) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
Also Read :Rashi Khanna : రాశి ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. సూపరో సూపర్..!
గనిలో చిక్కుకున్న కార్మికుల్లో నేపాల్‌కు చెందిన గంగా బహదూర్ శ్రేత్ (38), పశ్చిమ బెంగాల్‌కు చెందిన సంజిత్ సర్కార్ (35), అసోంకు చెందిన హుస్సేన్ అలీ (30), జాకీర్ హుస్సేన్ (38), సర్పా బర్మన్ (46), ముస్తఫా షేక్ (44), ఖుసీ మోహన్ రాయ్ (57) , లిజన్ మగర్ (26), శరత్ గోయరీ (37) ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది జనవరిలో నాగాలాండ్‌లోని వోఖా జిల్లాలో బొగ్గు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. నలుగురు గాయపడ్డారు. గత ఏడాది మేలో అసోంలోని తీన్ సుకియా జిల్లాలో ఒక గని కూలి ముగ్గురు మైనర్లు మరణించారు. 2022 సెప్టెంబరులో అదే జిల్లాలో ముగ్గురు బొగ్గు గని కార్మికులు విష వాయువును పీల్చి మరణించారు.