Vice President Candidate : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఎన్డీఏ సిద్ధం..ఆదివారం ఖరారు చేయనున్న మోడీ, అమిత్ షా.. !
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది.
- By Latha Suma Published Date - 03:32 PM, Sat - 16 August 25

Vice President Candidate : దేశానికి తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపిక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పదవిలో ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో, ఎన్నిక అవసరమైంది. ఈసీ వెంటనే కార్యాచరణ ప్రారంభించగా, నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21వ తేదీగా నిర్ణయించబడింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ, తన అభ్యర్థిని ఖరారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం (ఆగస్టు 17) న నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఖరారు చేసే అవకాశముంది. పార్టీ వర్గాల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అవసరమైన చర్చలు పూర్తిచేశారని తెలుస్తోంది. ముఖ్యంగా, ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలు ఎవరి పేరును ప్రకటించినా తమకు అభ్యంతరం లేదని స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో, నిర్ణయం మరింత సులభమవుతుంది.
Read Also: FASTag Annual Pass : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌కు అద్భుత స్పందన ..తొలి రోజు లక్షల్లో వినియోగదారులు కొనుగోలు
బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, పార్లమెంటరీ బోర్డు, అభ్యర్థి ఎంపిక అధికారాన్ని మోడీ, షాలకు అప్పగించే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి మొదలుకుని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరకూ పలువురు పేర్లు చర్చలోకి వచ్చాయి. వెంకయ్య నాయుడు ఇటీవల మోదీని కలిసి మాట్లాడినప్పటికీ, ప్రచారంలో ఉన్న ఏ పేరు అయినా తుది అభ్యర్థిగా ఖరారు చేయబడుతుందా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్, రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపికల సమయంలో వారి పేర్లు ముందుగా లీక్ కాకుండా అధికారికంగా ప్రకటించిన తర్వాతే వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో ఈసారి కూడా ఎవరూ ఊహించని అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక ప్రతిపక్షాల వైపు పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. ఇండియా కూటమి ఇప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ధన్‌ఖడ్ రాజీనామా పట్ల సానుభూతి చూపిస్తుండగా, ఈసారి బీజేపీ వివాదాస్పద అభ్యర్థిని నిలబెట్టితే మాత్రం ప్రతిపక్షాలు పోటీపై దృష్టి పెడతాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటింగ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఏకగ్రీవంగా ఎన్నిక కాదన్నట్లయితే ఓటింగ్ తప్పదు. అయితే బీజేపీ-ఎన్డీఏకి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా వారి అభ్యర్థి విజయం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి మోదీ-షా జోడీ ఎవరిని ఎంపిక చేస్తుందో అన్నది ఆదివారం లేదా సోమవారం వరకు ఎదురుచూడాల్సిందే. ఎన్డీఏలోనే కాదు, ప్రతిపక్షాల్లో కూడా ఈ అంశం పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎన్నికకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నప్పటికీ, ఖరారు చేయబోయే అభ్యర్థి పేరు చివరి నిమిషంలో అనూహ్యంగా వెలుగులోకి రావడం ఖాయం అనే సంకేతాలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.