Gujarat : సూరత్ ఎన్నికల సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం…నల్లజెండాలతో..!!
- Author : hashtagu
Date : 14-11-2022 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
త్వరలోనే గుజరాత్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంలో నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా గుజరాత్ లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నల్ల జెండాలతో కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
వాస్తవానికి సూరత్ ఈస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థికి మద్దతుగా ప్రసంగించేందుకు ఓవైసీ అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై నుంచి ప్రసంగం ప్రారంభించగానే నల్లజెండాలు చూపుతూ మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఇంతకుముందు సూరత్ లోని లింబయత్ లో తమ అభ్యర్థి కోసం ప్రచారం చేసేందుకు వెళ్తున్న ఓవైసీపై రాళ్ల దాడి జరిగింది.
కాగా గుజరాత్ లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలదశలో 89స్థానాలకు డిసెంబర్ 1న రెండో దశలో 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ తోపాటు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.