Kashmir Encounter : 40 గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
Kashmir Encounter : కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
- Author : Pasha
Date : 09-05-2024 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
Kashmir Encounter : కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను వెతుకుతూ కుల్గాం జిల్లాలోని రెడ్‌వానీ పయీన్ ప్రాంతంలో సోమవారం రాత్రి ప్రారంభమైన మిలిటరీ ఆపరేషన్ ఎట్టకేలకు గురువారం ఉదయం ముగిసింది. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమ, మంగళవారాల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగా.. బుధవారం అర్ధరాత్రి మరో ఉగ్రవాదిని కాల్చిచంపారు. దీంతో ఎన్‌కౌంటర్‌లో(Kashmir Encounter) హతమైన ఉగ్రవాదుల సంఖ్య మూడుకు చేరింది. దాదాపు 40 గంటల పాటు ఈ ఎన్‌కౌంటర్ కొనసాగడం గమనార్హం. దీని వివరాలను భారత్ సైన్యం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది. కశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఎన్‌కౌంటర్‌లో మట్టికరిచిన ఉగ్రవాదుల్లో లష్కరే తైబా టాప్ కమాండర్ బాసిత్ దార్ కూడా ఉన్నాడు. కశ్మీర్‌లో పలువురు నేతల హత్యకు అతడు కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. లష్కరే తైబాకే చెందిన ఉగ్రవాదులు మోమిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. వీరిద్దరూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు సాయం చేస్తుండే వారని తెలిసింది.
Also Read :Syamantaka Mani : రోజుకు 100 కేజీల బంగారమిచ్చే శమంతక మణి.. ఎక్కడుంది ?
మే 4న ఉగ్రదాడితో..
గత శనివారం (మే 4న) జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన వాహన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. దీనిని దగ్గరుండి చూసిన ఒక వ్యక్తి ఆ రోజు జరిగిన దాడి గురించి వెల్లడించారు. ‘‘భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఆ శబ్దాలకు నా పిల్లలు భయపడిపోయి, ఏడ్వడం మొదలుపెట్టారు. కొంతమంది సైనికులకు గాయాలయ్యాయి. వారిలో ఒకరు మరణించారని తర్వాత తెలిసింది. ఈ ప్రాంతమంతా చెట్లు దట్టంగా ఉండటంతో ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారో చూడలేకపోయాను. ఇక్కడ ఎన్‌కౌంటర్ జరగడం ఇదే తొలిసారి’’ అని ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చాడు. ఆ రోజున భారత వాయుసేన కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులనే తాజాగా ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు.