Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!
- Author : hashtagu
Date : 01-11-2022 - 5:36 IST
Published By : Hashtagu Telugu Desk
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో జరగాల్సిన పరివర్తన్ సంకల్ప్ యాత్రను వాయిదా వేసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అశోక్ గెహ్లాట్ తో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ రఘు శర్మ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈ ఘటనపై అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిష్పాక్షిక విచారణ జరిపి..ఘటనకు కారణమైన దోషులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆయన అభివర్ణిస్తూ.. ‘అత్యంత తొందరగా ఆదాయం వచ్చేలా వంతెనను ప్రారంభించారని.. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కేవలం అధికారుల అలసత్వం వల్లే ఇంత మంది మరణించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆదివారం రాత్రి మోర్బీలో నూటయాభై మందికి పైగా నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 400 నుంచి 500 మంది వరకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.