WB Elections : TMC నేతలను గుండాలతో పోల్చిన మోడీ
టీఎంసీ అణచివేతను ఎదిరించి ఓటర్లు నిర్భయంగా బయటకు రావడం బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించిందని ఆయన కొనియాడారు. బెంగాల్ సంస్కృతిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చేస్తున్న
- Author : Sudheer
Date : 24-04-2026 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (TMC) లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ దమ్ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్న ‘టీఎంసీ గూండాలు’ ఆ రోజు తర్వాత ఎక్కడా దాక్కోలేరని, వారిని ఎవరూ కాపాడలేరని ఆయన హెచ్చరించారు. అన్యాయానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన వంటి దారుణాలను ప్రస్తావిస్తూ, మహిళలపై జరుగుతున్న అరాచకాలకు ముగింపు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు.
జంగిల్ రాజ్‌కు ముగింపు – పాత ఫైళ్లు ఓపెన్!
గత కొన్నేళ్లుగా బెంగాల్‌లో సాగుతున్న టీఎంసీ ‘మహా జంగిల్ రాజ్’కు కాలం చెల్లిందని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి, అరాచకానికి సంబంధించిన పాత ఫైళ్లను తాము అధికారంలోకి రాగానే మళ్లీ ఓపెన్ చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం మాట మాత్రమే కాదని, ‘మోదీ గ్యారంటీ’ అని ఆయన ఉద్ఘాటించారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని సామాన్యులను హింసించే వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని, బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రికార్డు స్థాయి పోలింగ్‌పై హర్షం
బెంగాల్‌లో తొలి దశలో నమోదైన సుమారు 92 శాతం రికార్డు స్థాయి పోలింగ్‌ను ప్రధాని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ప్రజలు భారీ ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవడం మార్పును కోరుకుంటున్నారనడానికి నిదర్శనమని ఆయన విశ్లేషించారు. టీఎంసీ అణచివేతను ఎదిరించి ఓటర్లు నిర్భయంగా బయటకు రావడం బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించిందని ఆయన కొనియాడారు. బెంగాల్ సంస్కృతిని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చేస్తున్న ఈ పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని, రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.