Income Tax bill : ఆదాయపు పన్ను చట్టానికి నూతన రూపం.. 1961 చట్టానికి వీడ్కోలు పలికే దిశగా కేంద్రం అడుగు
వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించగా, దానిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం పలు మార్పులు చేసి, బిల్లును తాజా రూపంలో మళ్లీ లోక్‌సభకు తీసుకొచ్చింది.
- By Latha Suma Published Date - 03:34 PM, Mon - 11 August 25

Income Tax bill : ఆరు దశాబ్దాలకు పైగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961 త్వరలో చరిత్రగా మిగిలిపోనుంది. దేశపు పన్ను చట్టాల వేదికను మరింత ఆధునీకరించేందుకు, సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే, ఆదాయపు పన్ను (నం 2) బిల్లు – 2025ను నేడు లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. కమిటీ తన సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించగా, దానిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం పలు మార్పులు చేసి, బిల్లును తాజా రూపంలో మళ్లీ లోక్‌సభకు తీసుకొచ్చింది.
Read Also: Minister Post : మాట మార్చిన రాజగోపాల్..మంత్రి పదవి అవసరమే లేదు
అంతేకాదు, టాక్సేషన్ చట్టాల్లో సవరణల బిల్లును కూడా నిర్మలా సీతారామన్ నేడు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సులను దాదాపు మొత్తం ఆమోదించాం. పన్ను చట్టాలను ప్రజలకు మరింత సులభంగా అర్థమయ్యేలా, న్యాయంగా ఉండేలా కొత్త బిల్లును రూపొందించాం” అని పేర్కొన్నారు. 1961లో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టం, ఇప్పటి వరకూ 66 బడ్జెట్లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) అనేక మార్పులు చవిచూసింది. ఈ మార్పులన్నీ చట్టాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఫలితంగా, పన్ను చెల్లింపుదారులు పన్ను లెక్కల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, పన్ను చట్టం సరళతరం అవసరం ఎంతైనా ఉందని భావించిన కేంద్రం, 2024 జులై బడ్జెట్ సమయంలో కొత్త చట్టం రూపకల్పనపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజా ఆదాయపు పన్ను బిల్లును రూపొందించింది.
కొత్త బిల్లులో పన్ను సరళీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. పన్ను చెల్లింపుదారుల భారం తగ్గించేందుకు, వివరణాత్మక విధానాలు అమలులోకి తీసుకురానున్నారు. పైగా, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు తగినట్టుగా చట్టాన్ని మలచినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త చట్టంతో పన్ను పద్ధతుల్లో పారదర్శకత, సమర్థత, వేగం పెరగనుంది. ఎటువంటి ముడతలూ లేకుండా పన్నులు చెల్లించేలా ఏర్పాట్లు ఉండనున్నాయి. పార్లమెంటు రెండు సభల ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ మార్పులు దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్పష్టతనిచ్చే అవకాశముంది. పన్నుల వ్యవస్థపై భరోసా పెరిగేలా కేంద్రం కృషి చేస్తోంది.