BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్యత్యకు కుట్ర..?
- By HashtagU Desk Published Date - 12:26 PM, Thu - 31 March 22

దేశంలో ద కశ్మీర్ ఫైల్స్ మూవీ రగడ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్పందించిన కేజ్రివాల్ ఈ సినిమాను యూట్యూబ్‌లో పెడితే అందరూ ఫ్రీగా చూస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కశ్మీర్ ఫైల్స్ మూవీని యూట్యూబ్‌లో పెడితే అందరికీ అందుబాటులో వస్తుందని, దీంతో ఈ సినిమాను అందరూ ఉచితంగా చూడొచ్చు కదా అని కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు కోట్ల రూపాయలను దండుకుంటున్నారని మండిపడిన కేజ్రివాల్, బీజేపీ వాళ్లు మాత్రం సినిమా పోస్టర్లు వేసే పనిలో నిమగ్నమయ్యారని సెటైర్ వేశారు.
ఈ నేపధ్యంలో కశ్మీర్ ఫైల్స్ మూవీ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పై భగ్గుమన్న బీజేపీ శ్రేణులు ఆందోళణలు చేపట్టాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఇంటి వద్దకు భారీగా చేరిన యువ కాషాయదళం కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వెళ్లి కేజ్రీవాల్ నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు, గేటును ధ్వంసం చేశారు. కేజ్రీవాల్ ఇంటి గేటుకు కాషాయ రంగు చల్లారు.
బీజేపీ యుమోర్చా అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. తేజస్వీ సూర్య స్వయంగా బారికేడ్లు ఎక్కారు. సూర్య బారికేడ్లు దూకుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 200 నుంచి 300 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే కేజ్రివాల్ ఇంటి ముందు ఆందోళణలకు దిగిన నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య సహా పలువురు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక ఢిల్లీలో కేజ్రివాల్ నివాసం వద్ద, బీజేవైఎం కార్యకర్తలు చేపట్టిన ఆందోళనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. సీఎం కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ గూండాలు విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాల్సిందిపోయి సినిమా తీస్తే ఏమొస్తుందని ఆప్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆప్ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో కీలక అడుగులు వేస్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుందని, పంజాబ్‌లో ఓటమిని తట్టుకోలేక కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి ఈ వ్యవహారం పై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.